అక్షరటుడే, వెబ్ డెస్క్: జన్వాడ ఫామ్ హౌస్.. రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ కొనసాగుతోంది. మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల కు చెందిన ఈ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగిందనే ప్రచారం తీవ్ర దుమారం రేపుతోంది. ఇదే అదనుగా కేటీఆర్ పై కాంగ్రెస్, భాజపా నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. శనివారం రాత్రి నుంచి ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసిన నేపథ్యంలో… దీనికి సంబంధించిన కీలక అంశాలను ఓసారి పరిశీలిద్దాం.
అసలేం జరిగింది..?
జన్వాడలోని రాజ్‌పాకాల ఫామ్ హౌస్‌పై అర్ధరాత్రి పోలీసుల దాడులు చేశారు. రిజర్వ్ కాలనీలో రాజ్ పాకాల ఫామ్ హౌస్‌లో వేడుకలు నిర్వహించారు. భారీ శబ్ధాలతో ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. తనిఖీలు చేపట్టి, 24 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు.
విదేశీ మద్యం
ఫామ్‌హౌస్‌లో రైడ్ చేసినప్పుడు 21 మంది పురుషులు, 14 మంది స్త్రీలు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. 7 విదేశీ మద్యం బాటిళ్లు, 10 లోకల్ మద్యం బాటిళ్లు, గేమింగ్ ఐటమ్స్‌ను గుర్తించినట్టు చెప్పారు. రాజ్ పాకాలపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.
నార్కోటి కేసు
నార్కోటిక్ కేసులో ఏ 1 గా రాజ్ పాకాల, ఏ 2 గా విజయ్ మద్దూరి పేర్లు నమోదు చేశారు. మోకిల పీఎస్‌లో ఇద్దరిపై ఎస్ఐ కోటేశ్వరరావు ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది.
కొకైన్ పాజిటివ్!
విజయ్ మద్దూరికి కొకైన్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీపీఎస్ యాక్ట్, సెక్షన్ 34 ఎక్సైజ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.
కేటీఆర్ ఉన్నారా?
పార్టీలో పాల్గొన్న వారంతా హై ప్రొఫైల్ వ్యక్తులేనని సమాచారం. ఫామ్‌హౌస్‌కి పోలీసులు రావడానికి కొద్దిసేపటి ముందే.. అక్కడి నుంచి మాజీమంత్రి కేటీఆర్ వెళ్లిపోయారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. పార్టీలో కేటీఆర్ భార్య ఉందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖం కనిపించని ఓ మహిళను కేటీఆర్ భార్య అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ముమ్మర గాలింపు
రాజ్ పాకాల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రాయదుర్గం ఓరియన్ విల్లాస్‌లోని రాజ్ పాకాల సోదరుడు శైలేందర్ విల్లాలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. అంతకు ముందు పోలీసులు, భారాస నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విల్లాలోకి వెళ్తున్న ఎక్సైజ్ పోలీసులను భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. సెర్చ్‌వారెంట్ లేకుండా ఎలా తనిఖీలు చేస్తారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు మాగంటి గోపీనాథ్, వివేకానంద, బాల్క సుమన్ సహా పలువురు నేతలను అరెస్టు చేశారు.
కేటీఆర్ స్పందన
ఫామ్ హౌస్ వివాదంపై కేటీఆర్ స్పందించారు. ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడారు. అది ఫామ్ హౌస్ కాదని తన బావమరిది కొత్త ఇల్లు అన్నారు. ఇంట్లోకి వెళ్లిన సందర్భంగా బంధుమిత్రులకు దావత్ ఇస్తున్నారన్నారు. దీనికి సోషల్ మీడియాలో రేవ్ పార్టీ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఫ్యామిలీ పార్టీలో 70 ఏళ్ల వయసున్న తన అత్తమ్మతో పాటు చిన్న పిల్లలు ఉన్నారన్నారు. దాన్ని రేవ్ పార్టీ అని ఎలా అంటారని కేటీఆర్ ప్రశ్నించారు. ఆరు గ్యారంటీల అమలు, ఇతర విషయాలపై తమ ప్రశ్నలకు మంత్రులు సహా కాంగ్రెస్ నేతలు ఏ ఒక్కరూ ముందుకొచ్చి సమాధానం చెప్పే పరిస్థితి లేదన్నారు. అందుకే మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక తమ కుటుంబసభ్యులు, బంధువులపై కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.
డీజీపీకి కేసీఆర్ ఫోన్!
జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ వివాదంపై భారాస అధినేత కేసీఆర్ ఆరా తీశారు. డీజీపీ జితేందర్ కు కేసీఆర్ ఫోన్ చేసినట్టు సమాచారం. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల, ఆయన సోదరుడు శైలేందర్ ఇళ్లలో తనిఖీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు ఇళ్లలో ఎలా తనిఖీలు చేస్తారని ప్రశ్నించారు. వెంటనే తనిఖీలు ఆపాలని డీజీపీని కోరినట్టు తెలిసింది.
రఘునందన్ విమర్శ
ఫామ్ హౌస్ ఘటనపై భాజపా ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. సీసీటీవీ ఫుటేజీని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రేవ్ పార్టీ నిర్వహించిన వారికి, పాల్గొన్న వారికి శిక్ష పడాలన్నారు. సిట్ ఏర్పాటు చేసి త్వరితగతిన విచారణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా మార్చాలని ప్రయత్నిస్తుంటే.. మరోవైపు కొందరు హైదరాబాద్ శివార్లను డ్రగ్స్ అడ్డాగా మారుస్తున్నారని వ్యాఖ్యానించారు.