అక్షరటుడే, కామారెడ్డి: కామారెడ్డి మెడికల్ కాలేజీలో Kamareddy Medical College ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, అనర్హులకు జాబ్‌లు ఇచ్చారని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మెరిట్ ప్రకారం కాకుండా ఇష్టారాజ్యంగా ఆర్డర్ కాపీలు ఇచ్చారని పేర్కొంటున్నారు. కాగా.. ఈ వ్యవహారంలో భారీగా ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మెడికల్ కాలేజీలో Medical College ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 50 ఉద్యోగాల భర్తీ కోసం గతేడాది నోటిఫికేషన్ విడుదలైంది. అయితే టెండర్ దక్కించుకున్న ఏజెన్సీ నిబంధనల ప్రకారం కాకుండా.. లోపాయకారి ఒప్పందాలతో నియామకాలు చేపట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికారులు ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. తాజాగా ఈ 50 ఉద్యోగాల్లో 45 పోస్టులను భర్తీ చేశారు. అర్హత, సీనియారిటీ, మెరిట్ ఏమీ చూడకుండా ఉద్యోగాలు ఇచ్చారని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
Medical College | నియామకాల తర్వాత మెరిట్ జాబితా
ఉద్యోగాల భర్తీ సమయంలో ఎక్కడైనా మొదట మెరిట్ లిస్ట్ విడుదల చేసి నియామకాలు చేపడుతారు. కానీ కామారెడ్డి మెడికల్ కాలేజీ Kamareddy Medical Collegeలో మాత్రం ముందు నియామక ప్రక్రియ పూర్తయ్యాక.. మెరిట్ లిస్ట్ విడుదల చేయడం గమనార్హం. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులెవరికి తెలియకుండా నచ్చిన వారికి నియామక ఉత్తర్వులు అందజేసినట్టు తెలుస్తోంది. ఈ విషయమై అభ్యర్థులు ఆందోళన చేపట్టి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తీరా ఆ తర్వాత మెరిట్ జాబితాను కళాశాల నోటీస్ బోర్డుపై ఉంచడం అనుమానాలకు తావిస్తోంది.
Medical College | మారిన పర్సంటేజీలు
మెడికల్ కాలేజీలో ఉద్యోగాలను మ్యాన్ పవర్ ఏజెన్సీ భర్తీ చేసింది. అభ్యర్థుల పర్సెంటేజీ, అర్హత వివరాలను ముందుగానే సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. అయితే వెబ్సైట్లో ఉన్న పర్సంటేజీలు, మెరిట్ జాబితాలో ఉన్న పర్సంటేజీలు వేర్వేరుగా ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
లావుడ్య రవి అనే అభ్యర్థి సిటీ స్కాన్ విభాగంలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోగా ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ జిరాక్సులో తేదీ లేదని రిజెక్ట్ చేశారు. ఒరిజినల్ సర్టిఫికెట్లో ఉన్న తేదీ జిరాక్సు కాపీలో ఎలా మాయమవుతుందని అభ్యర్థి ప్రశ్నిస్తున్నాడు. వెబ్సైట్లో 35 పర్సెంటేజ్ ఉన్న వ్యక్తికి కొత్త జాబితాలో 44.5 గా మార్చి ఉద్యోగమిచ్చారని బాధిత అభ్యర్థి ఆరోపించాడు. కమ్మరి అరవింద్ రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే తన స్థానంలో ఉద్యోగం వచ్చిన అభ్యర్థికి వెబ్సైట్లో 39.6 పర్సెంటేజ్ ఉండగా మెరిట్ జాబితాలో 72 శాతం చేసి జాబ్ ఇచ్చారని ఆయన ఆరోపించాడు. ఇలా అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Medical College | ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయిస్తాం

– వినోద్, గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షుడు
మెడికల్ కళాశాలలో ఔట్ సోర్సింగ్ విభాగంలో చేపట్టిన నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగాయి. అర్హత ఉన్నవాళ్లను పక్కన పెట్టి అనర్హులకు ఉద్యోగాలిచ్చారు. ఈ విషయమై పలుమార్లు ఉన్నతాధికారులకు వినతిపత్రాన్ని అందజేశాం. అధికారులు విచారణ జరిపి అర్హులైన అభ్యర్థులకే ఉద్యోగాలివ్వాలి. లేకపోతే ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయిస్తాం.
Medical College | క్రాస్ చెక్ చేశాకే ఫైనల్ లిస్ట్ చేశాం

– శివప్రసాద్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్
ఔట్ సోర్సింగ్ నియామకాల ప్రక్రియను ఉన్నతాధికారులు మ్యాన్ పవర్ ఏజెన్సీకి అప్పగించారు. ఏజెన్సీ నిర్వాహకులు దరఖాస్తులను పరిశీలించి మాకు అందించారు. మేము వాటిని క్రాస్ చెక్ చేశాకే ఫైనల్ లిస్ట్ ఇచ్చాం. ఏజెన్సీ వారు డబ్బు తీసుకున్నట్లు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దానికి మాకు సంబంధం లేదు. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారని విచారణలో తేలితే తొలగిస్తాం. ఎక్స్పీరియన్స్, ఇతర సర్టిఫికెట్లు లేని వాళ్లకు అవకాశం రాలేదు.