అక్షరటుడే, జుక్కల్ : ఆరోగ్యవంతమైన సమాజం కోసం పరిసరాలను శుభ్రం చేస్తున్న పంచాయతీ కార్మికులకు అండగా ఉంటామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. మద్నూర్ ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోడ్లను, మురికి కాలువలను శుభ్రం చేస్తున్న పంచాయతీ కార్మికులను అభినందించారు. కార్మికులు బాగుంటేనే సమాజం బాగుంటుందని పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహించిందన్నారు. అనంతరం వారికి ఐడీ కార్డులు పంపిణీ చేశారు. పలువురు బాధితులకు సీఎం సహాయ నిధి చెక్కులు అందజేశారు. అనంతరం మద్నూర్లో బీటీ రోడ్డు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.