అక్షరటుడే, వెబ్ డెస్క్: కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో ఈరోజు కైశిక ద్వాదశి ఆస్థానం వేడుకగా నిర్వహించారు. వేకువ ఝామునే శ్రీదేవి, భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాసమూర్తి మాడవీధుల్లో ఊరేగించారు. చిరు జల్లులు కురవడంతో ఘటాటోపం లోపల స్వామివారిని ఉంచారు. వేంకటతురైవార్, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు. ఊరేగింపు అనంతరం స్వామి, అమ్మవార్లను బంగారు వాకిలి చెంతకు చేర్చి, పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకలో చిన్నజీయర్‌స్వామి, టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీధర్, డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ రామకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు.