భారీ అంచనాలతో రిలీజైన కల్కి 2898 ఏడీ బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొడుతోంది. జూన్‌ 27న రిలీజైన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధిస్తోంది. సినిమా విడుదలైన వారం రోజుల్లో రూ.650 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాలే కాకుండా బాలీవుడ్‌లోనూ రికార్డుల మోత మోగిస్తోంది. అంతేకాకుండా అమెరికా, మలేషియా, జర్మనీ, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో భారీ వసూళ్లు రాబడుతోంది.

మైథాలజీ, సైన్స్‌కి భారీ గ్రాఫిక్‌ తోడైతే కల్కి మూవీ..

కల్కి చిత్ర దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ నేటి కాలానికనుగుణంగా మైథాలజీకి సైన్స్‌కి భారీ గ్రాఫిక్స్‌ జోడించి ఈ సినిమాను తెరకెక్కించారు. అక్కడక్కడ సినిమా కాస్త బోరింగ్‌గా ఉన్నా.. మిగతా భాగమంతా రక్తికట్టించారు. హాలీవుడ్‌ స్థాయిలో గ్రాఫిక్స్‌ వినియోగించి రోబోటిక్‌ ఎట్రాక్షన్‌తో సినిమా రూపొందించిన విధానంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

సినిమా ఎలా ఉందంటే..

ఈ భూమిపై నీళ్లు ఇంకిపోతే.. కాలుష్యంతోపాటు వేడికి ఎడారిగా మారిపోతే.. కలి ప్రభావం అంతమొందించేందుకు.. ఈ భువిపై మరల స్వచ్ఛమైన ప్రకృతి దర్శన భాగ్యం కోసం కల్కి పుట్టాల్సిందే.. అని ఈ కల్కి సినిమా సారాంశం. కురుక్షేత్రం తర్వాత ఆరు వేల ఏళ్లకు మొదలయ్యే కథ ఇది. భూమిపై తొలి నగరంగా పురాణాలు చెబుతున్న కాశీ.. భవిష్య కాలంలో అప్పటికి చివరి నగరంగా మిగిలిపోయి ఉంటుంది. భూమిపై ఉన్న అన్ని వనరులను పీల్చేసి స్వర్గంలాంటి కాంప్లెక్స్‌ను నిర్మించి పాలిస్తుంటాడు సుప్రీం యాస్కిన్‌(కమల్‌ హాసన్‌). కాశీలో బౌంటీ ఫైటర్‌ అయిన భైరవ(ప్రభాస్‌) యూనిట్స్‌ను సంపాదించి కాంప్లెక్స్‌కి వెళ్లి అక్కడ స్థిరపడిపోవాలనే ప్రయత్నాల్లో ఉంటాడు. సుప్రీం యాస్కిన్‌ తలపెట్టిన ప్రాజెక్ట్‌ – కే కోసం.. కాంప్లెక్స్‌ సైన్యం కాశీకి వచ్చి గర్భం దాల్చే అవకాశాలున్న అమ్మాయిల్ని కొనుగోలు చేసుకుని వెళ్తూ ఉంటుంది. అలా ఎంతోమంది అమ్మాయిల్ని ప్రాజెక్ట్‌-కే కోసం గర్భిణులను చేసి, వారి నుంచి సీరమ్‌ సేకరిస్తూ ప్రయోగాలు చేపడుతుంటారు. అలా సుమతి(దీపికా పదుకొణె) కాంప్లెక్స్‌లో చిక్కుకుపోయి గర్భం దాలుస్తుంది. మరోవైపు రేపటి కోసం అంటూ శంబల ప్రజలు ఎన్నో త్యాగాలు చేస్తూ.. ఓ తల్లి కోసం ఎదురు చూస్తుంటారు. ఆ తల్లి సుమతి అని నమ్ముతారు. మరి ఆమెని కాంప్లెక్స్‌ ప్రయోగాల నుంచి ఎవరు కాపాడారు? చిరంజీవి అయిన అశ్వత్థామ, భైరవకు సంబంధం ఏమిటి? సుప్రీం యాస్కిన్‌ ప్రాజెక్ట్‌- కే లక్ష్యమేమిటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే..

గొప్ప సినిమాకు ఉండే గొప్ప లక్షణం ఏమిటంటే.. కథలోకి ప్రేక్షకుల్ని మొదటి ఫ్రేమ్‌ నుంచే లీనం చేయడం. ఎక్కువ టైం తీసుకోకుండా.. కళ్లు తిప్పుకోకుండా ప్రేక్షకులను కూర్చోబెట్టగలగడం. అదే దర్శకుడి ప్రథమ విజయం. కల్కి కూడా అలాగే మొదలవుతుంది. అందుకే కాశీ, కాంప్లెక్స్‌, శంబల ప్రపంచాల్లోకి మనల్ని చాలా తేలికగా తీసుకెళ్తుంది. మొదటి ఐదారు నిమిషాలు మిస్సవ్వకూడదు. క్లైమాక్స్‌కు లింక్‌ అంతా అక్కడే ఉంది.

నేటి కాలానికి అనుగుణంగా..

పురాణేతిహాసాల్లోని పాత్రలను సూపర్‌ హీరోలుగా మలిచిన తీరు అమోఘం. మైథాలజీకి సైన్స్‌కి లింక్‌ చేసిన విధానం అద్వితీయం. హాలీవుడ్‌ వాళ్లు చేసేది ఇదే. ‘మార్వెల్‌’ సిరీస్‌లో అధికంగా వాళ్ల దేవుళ్లను నేటి కాలానికి అనుగుణంగా తీస్తారు. మన అర్జునుడు, కర్ణుడు, కృష్ణుడు, అశ్వత్థామ పాత్రలను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఇప్పటి కాలానికి అన్వయించిన తీరు ఆకట్టుకుంటుంది. సినిమా మొదలైన 15 నిముషాల తరువాత కాస్త బోర్‌ కొడుతుంది. బయటకు వెళ్లిపోదామా.. అనిపిస్తుంది. కానీ దర్శకుడి ప్రతిభ ఇక్కడే కనబడుతుంది. అదే సమయంలో ప్రేక్షకుల నిర్లిప్తత ను దూరం చేస్తూ.. మృణాల్‌ ఠాకూర్‌, రాజేంద్రప్రసాద్‌, దుల్కర్‌, రాజమౌళి, బ్రహ్మానందం, ఫరియా అబ్దుల్లా ఇలా.. మెరిసే తారలు ప్రత్యక్షమవుతారు.

మన భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించిన విధానం మాత్రం అద్భుతమనే చెప్పాలి. ప్రేక్షకులకు ఎక్కడా తెలుగు చిత్రం చూస్తున్నాననే ఫీలింగ్‌ కలగదు. ఒక హాలీవుడ్‌ సినిమా చూస్తున్నట్లే అనిపిస్తుంది. థియేటర్‌లోకి కాకుండా.. ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లు అంతా అనిపిస్తుంది. ముఖ్యంగా శంబల, కాంప్లెక్స్‌ ప్రపంచాలు గొప్పగా తీర్చిదిద్దారు. చివరి అరగంట సినిమా తీర్చిదిద్దిన విధానం.. ఇక మీదట ప్రపంచ సినిమా అంటే తెలుగు చిత్రం గురించి కూడా మాట్లాడుకునేలా తీశారు.

అగ్ర తారాగణం

భారీ బడ్జెట్‌, నాలుగేళ్ల నిర్మాణం, అమితాబ్‌, కమల్‌ వంటి అగ్ర తారాగణం నటించడంతో యావత్‌ భారతీయ సినీ పరిశ్రమ దృష్టిని కల్కి చిత్రం ఆకర్షిస్తోంది. ఇక అద్భుతమైన విజువల్స్‌తో ప్రపంచమంతటినీ అబ్బురపర్చుతున్నారు. ఇందులో కల్పిత ప్రపంచాలు కనిపించినప్పటికీ.. వాటికి మన పురాణాల్ని మేళవిస్తూ కథ చెప్పిన తీరు బాగుంది.

– నరేశ్ చందన్