అక్షరటుడే, కామారెడ్డి టౌన్: ఆస్పత్రులను తనిఖీ చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్ కోసం అనుమతులకు సిఫారసు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రతిపాదనలను సంబంధిత అధికారులు చట్టం ప్రకారం పరిశీలించి సిఫారసు చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 127 ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత సమావేశంలో 19 ప్రతిపాదనలు రాగా 17 ఆస్పత్రులకు అనుమతులు ఇవ్వడానికి అంగీకరించినట్లు తెలిపారు. జిల్లాలో ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులు, ల్యాబ్ లు జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ అనుమతితో రిజిస్ట్రేషన్ చేయాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ సింధు శర్మ, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీఎంహెచ్వో చంద్రశేఖర్, ఐఎంఏ అధ్యక్షుడు ఎంవీ రమణ, ప్రాజెక్టు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.