అక్షరటుడే, ఎల్లారెడ్డి: ఆయిల్ పామ్ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెదలో గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం కళాశాల ఆవరణలో రాశివనం, గార్డెనింగ్, ఇతర ప్లాంటేషన్ ను పరిశీలించారు. ఆయిల్ పామ్ మొక్కల పెంపకానికి అవకాశం ఉన్న చోట రైతులను ప్రోత్సహించాలని డీఏవో భాగ్యలక్ష్మిని ఆదేశించారు. అనంతరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. అలాగే పీహెచ్ సీని సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. ఆయన వెంట ఆర్డీవో మన్నె ప్రభాకర్, డీఆర్డీవో సురేందర్, డీపీవో శ్రీనివాస్, డీఎంహెచ్ వో చంద్రశేఖర్, ఏరువాక శాస్త్రవేత్తలు, కళాశాల అధ్యాపకులు, తదితరులు ఉన్నారు.