అక్షరటుడే, వెబ్ డెస్క్: ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలో బుధవారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్కారు బడుల్లో విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా బోధన జరుగుతోందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ.. విద్యతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని తెలిపారు. విద్యార్థులు ఇష్టపడి చదివి అన్నిరంగాల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో దేవి సింగ్, మండల కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్ , జయప్రదీప్ పాల్గొన్నారు.