అక్షరటుడే, కామారెడ్డి: రాజ బహదూర్ వెంకట రామారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించనున్న పాఠశాల, వసతి గృహం నిర్మాణం కోసం పార్టీలకతీతంగా రెడ్డిలందరూ వితరణ చేసి భాగస్వాములు కావాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. కామారెడ్డిలోని లక్ష్మీదేవి గార్డెన్ లో ఆదివారం నిర్వహించిన రెడ్డిల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే మాట్లాడారు. జిల్లాలోని రెడ్డి కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం చేస్తే పేద విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఎదగడానికి దోహద పడినవారవుతారని చెప్పారు. తన వంతుగా రూ. 25 లక్షలు వితరణ అందజేసి తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. హాస్టల్ నిర్మాణం నమోనాలను ప్రజెంటేషన్ రూపంలో వివరించారు. భవన నిర్మాణానికి వితరణ ఇచ్చిన డబ్బులు సరిపోకపోతే మిగతా డబ్బులు తాను సమకూర్చి భవన నిర్మాణాలను పూర్తి చేస్తానని పేర్కొన్నారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇందుప్రియ మాట్లాడుతూ రూ. 11 లక్షలు వితరణ చేస్తున్నట్లు తెలిపారు. వైద్యుడు రవీందర్ రెడ్డి రూ. 11 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇతర జిల్లాలకు చెందిన వారు రూ. రెండు లక్షలు అందజేశారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త ఎల్లారెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మన్నగారి సుభాష్ రెడ్డి, జిల్లా ట్రస్ట్ ఛైర్మన్ చంద్రారెడ్డి, ప్రతినిధులు రాజ్ కుమార్ రెడ్డి, భూంరెడ్డి, గంగారెడ్డి, సంతోష్ రెడ్డి, సాగర్ రెడ్డి పాల్గొన్నారు.