అక్షరటుడే, కామారెడ్డి: కామారెడ్డి బల్దియా చైర్ పర్సన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. సోమవారం ఉదయం కౌన్సిల్ లో ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు. పీఠాన్ని దక్కించుకునేందుకు మూడు పార్టీలు తమ ప్రయత్నాలు వేగవంతం చేశాయి. చైర్‌పర్సన్ సీటును కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. మొన్నటి వరకు కాంగ్రెస్‌కే దక్కుతుందని అందరూ భావించారు. అనూహ్యంగా బీజేపీ రంగంలోకి దిగడంతో కొంత సందిగ్ధత నెలకొంది. అలాగే బీఆర్‌ఎస్ సైతం పోటీ చేయాలని ఏర్పాట్లు చేసుకుంటోంది. దీంతో కామారెడ్డి మున్సిపల్‌లో రాజకీయం వేడెక్కింది. బల్దియాలో మొత్తం 49 కౌన్సిలర్లు, ఒక ఎక్స్ అఫీషియో మెంబర్‌తో 50 మంది సభ్యులున్నారు. ఇందులో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 27 మంది కౌన్సిలర్ల బలం ఉంది. కానీ, పదవి కోసం ఇద్దరు పోటీలో ఉన్నారు. అలాగే బీఆర్‌ఎస్‌కు 16 మంది బలం ఉన్నా 10 మంది గత చైర్‌పర్సన్ నిట్టు జాహ్నవికి వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో బీఆర్‌ఎస్‌లో రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. ఇక బీజేపీకి ఆరుగురు కౌన్సిలర్లు, ఒక ఎక్స్ అఫీషియో మెంబర్ ఉన్నారు. కాంగ్రెస్‌కు సరిపడా సంఖ్యాబలం ఉన్నా.. ఇద్దరు కౌన్సిలర్లు పదవి కోసం పోటీ పడుతున్నారు. వైస్ చైర్‌పర్సన్ ఇందుప్రియతో పాటు కౌన్సిలర్ ఉర్దొండ వనిత రేసులో ఉన్నారు. ఈ పోటీలో కౌన్సిలర్లు చీలిపోతే నష్టపోవాల్సి వస్తుందని భావించిన పార్టీ వారందరినీ క్యాంపునకు తరలించింది. చివరకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నిర్ణయం మేరకు కౌన్సిలర్లు నడుచుకుంటారని, కాంగ్రెస్ బల్దియా పీఠాన్ని చేజిక్కించుకోవడం ఖాయమని తెలుస్తోంది.
ఆ రెండు పార్టీల ప్రయత్నాలు
నియోజకవర్గంలో కామారెడ్డి మున్సిపాలిటీ అత్యంత కీలకం. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి పార్టీ పట్టు పెంచుకునేలా చూస్తున్నారు. ప్రస్తుతం బీజేపీకి ఆరుగురు కౌన్సిలర్లు, ఎమ్మెల్యే కేవీఆర్ ఎక్స్ అఫీషియో మెంబర్‌గా ఉన్నారు. వీరితో పాటు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నుంచి కొంత మంది కౌన్సిలర్లను తమవైపునకు తిప్పుకుని పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇటీవలే పదవి కోల్పోయిన బీఆర్‌ఎస్ సైతం తమ అభ్యర్థిని పోటీలో పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇలా మూడు పార్టీలు బల్దియా పీఠంపై గురిపెట్టడంతో కామారెడ్డిలో రాజకీయం హాట్‌హాట్‌గా మారింది. పీఠం ఎవరికి దక్కుతుందో తెలియాలంటే సోమవారం మధ్యాహ్నం వరకు వేచి చూడాల్సిందే.!