అక్షరటుడే, కామారెడ్డి : కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ సుజాత బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెను వరంగల్ జిల్లాకు బదిలీ చేశారు. కాగా ఈ సంవత్సరం ఫిబ్రవరి 15న ఆమె కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. విధి నిర్వహణలో కమిషనర్ నిక్కచ్చిగా వ్యవహరించడమే బదిలీ కావడానికి కారణమనే ప్రచారం జరుగుతోంది. ఇందిరమ్మ కమిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇచ్చిన పేర్లు కాకుండా కాంగ్రెస్ నాయకుల పేర్లు రావడంపై కౌన్సిలర్లు కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేయగా ఇన్ చార్జి మంత్రి ఇచ్చిన పేర్లను ఫైనల్ చేశామని కమిషనర్ చెప్పడం కూడా బదిలీకి ఒక కారణమని పొలిటికల్ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు కామారెడ్డికి కొత్త కమిషనర్ ఎవరు రాబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ పని చేయాలంటే రాజకీయ నాయకుల ఒత్తిళ్లు తట్టుకోవడం అంత సులువు కాదన్న వాదన వినిపిస్తోంది.