చిట్‌ఫండ్‌ కంపెనీ నిర్వాహకుల అరెస్ట్‌

అక్షరటుడే, కామారెడ్డి: పట్టణంలోని ఎస్‌ఎల్‌వీఎస్‌ చిట్‌ఫండ్‌ కంపెనీ నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. యజమానులు బిల్ల దశరథ్‌ రెడ్డి, పద్మావతి, నితీష్‌, అచ్యుత్‌ను సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ చంద్రశేఖర్‌ రెడ్డి వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. పట్టణంలోని ఎస్‌బీఐ బ్యాంకు భవనంపై ఉన్న ఎస్‌ఎల్‌వీఎస్‌ కంపెనీ చిట్‌ఫండ్‌ పేరిట మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. తాజాగా బాధితుడు అహ్మద్‌ మొహినుద్దీన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. చిట్స్‌ వేసిన వారికి డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు విచారణలో గుర్తించారు. కామారెడ్డితో పాటు ఆర్మూర్‌, నిజామాబాద్‌, కోంపల్లి, సిద్దిపేట్‌, మెదక్‌, వికారాబాద్‌, మెట్‌పల్లి, వనపర్తిలో పదికి పైగా బ్రాంచిలను ఏర్పాటు చేసి రూ.2 కోట్లకు పైగా మోసం చేసినట్లు తేల్చారు. నిందితుడు దశరథ్‌ రెడ్డి ఉపాధ్యాయుడు కాగా.. అతని కుటుంబీకుల పేర్ల మీద ఎస్‌ఎల్‌వీఎస్‌ చిట్‌ఫండ్‌ను స్థాపించి పలువురిని మోసగించినట్లు సీఐ తెలిపారు. వీరందరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని, ఇంకా ఎవరైనా మోసపోయిన బాధితులు ఉంటే కామారెడ్డి స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సీఐ చంద్రశేఖర్‌ రెడ్డి సూచించారు.

Advertisement
Advertisement
Advertisement