అక్షరటుడే, వెబ్ డెస్క్: కార్తీకం.. శివకేశవుల ప్రీతికరమైన మాసం. శ్రీకృష్ణుడి(శ్రీ మహావిష్ణువు)ని కొల్చేవారు దామోదర మాసంగా.. పరమేశ్వరుని ఆరాధించేవారు కార్తీక మాసంగా పేర్కొనే ఈ నెల ఆసాంతం అత్యంత పవిత్రమైన రోజులుగా భావిస్తుంటారు. చంద్రుడు కృతిక నక్షత్రంలో ఉండడం వల్ల ఈ మాసానికి ఆ పేరు వచ్చింది అంటారు. ఈ నెలలో ముఖ్యంగా వేకువ జామునే నదీ స్నానాలు, ఆకాశ దీపాలు వెలిగించడం, పంచాక్షరి, విష్ణు సహస్రనామ పారాయణలు, సత్యనారాయణ వ్రతాలు, తులసీ వివాహాలు చేస్తారు. కార్తీక మాసం మొత్తం ఉపవాసాలు, పూజలు, సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భక్తులు దైవకృపను పొందుతారని, వారి జీవితాలు సద్గుణాలతో నిండుతాయని విశ్వాసం. అయ్యప్ప దీక్షలు ఈ మాసంలోనే ప్రారంభమై సంక్రాంతి వరకు కొనసాగుతాయి.
పుణ్య స్నానాలు
కార్తీక మాసంలో గంగా, పుణ్య నదుల్లో స్నానం చేయడం పుణ్యకార్యంగా భావిస్తారు. ఇది శరీరంతో పాటు మనసును పవిత్రం చేస్తుందని విశ్వసిస్తారు.
దీపారాధన
కార్తీక మాసంలో ప్రత్యేకంగా దీపాలు వెలిగించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. రోజూ తులసి మొక్క వద్ద, దేవాలయాల్లో, నదీ తీరాల్లో దీపాలు వెలిగించడం ఆనవాయితీ. ముఖ్యంగా వేకువ జామునే, అంటే సూర్యోదయానికి ముందే ఆకాశదీపం వెలిగిస్తుంటారు.
ఉపవాస దీక్షలు
కార్తీక మాసమంతా ఒంటిపూట భోజనం చేసే వారుంటారు. కేవలం సోమవారాలు, కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం చేసే వారుంటారు. ఏకాదశి తిథులలో ఉపవాసం చేసే వారుంటారు. ఎవరు ఏ విధంగానైనా ఆ దేవదేవులను కొలిచినా.. ఉపవాసం భక్తులను భగవంతుని దగ్గరగా తీసుకెళ్తుంది. ఉపవాసం అర్థం కూడా అదే. భగవంతునికి దగ్గరగా, వాసం అంటే నివసించడం అని పురాణాల్లో పేర్కొనబడింది. అందుకే ఉపవాసానికి అంతటి విశిష్టత ఉంది.
పంచాక్షరి జపం
కార్తీక మాసంలో ప్రతి సోమవారం శివాలయాల్లో భక్తులు విశేషంగా పూజలు చేస్తారు. పంచామృతంతో అభిషేకిస్తారు. రుద్రాభిషేకం జరిపిస్తారు. పంచాక్షరి జపంతో కొలుస్తారు. అన్న పూజ నిర్వహిస్తారు.
సత్యనారాయణ వ్రతాలు
కార్తీక మాసంలో ముఖ్యంగా పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతాలు చేస్తుంటారు. శ్రీమహావిష్ణువును సహస్రనామాలతో కొలుస్తారు. బంధుమిత్రులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తారు.
తులసి పెళ్లి
కార్తీక మాసంలో తులసి, శ్రీమహావిష్ణువు వివాహం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. తద్వారా సుఖసంతోషాలు, ఐశ్వర్యం పొందుతారని నమ్మకం.