అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కవిత బెయిల్‌ కోసం సుప్రీం కోర్టు తలుపు తట్టడంతో ఆమెకు బెయిల్‌ వస్తుందా? లేదా? అనే చర్చ జరుగుతోంది. ఇదే కేసులో రెండు రోజుల క్రితం ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాకు దేశ అత్యున్నత న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో తీహార్ జైలులో ఉన్న కవిత కూడా శనివారం సుప్రీం కోర్టులో బెయిల్ కోసం పిటీషన్ వేయడం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు కవిత ఆరోగ్యం బాగాలేదని.. మరోవైపు సిసోడియాకు బెయిల్‌ రావడంతో.. తమ నాయకురాలికి కూడా ఊరట లభిస్తుందని గులాబీ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. అయితే సిసోడియాకు న్యాయస్థానం 17 నెలల తర్వాత ఊరట కల్పించింది. కానీ కవితను ఈడీ గత మార్చిలో అరెస్టు చేసింది. అయితే అప్పటి నుంచి ఆమె బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ కూడా కేసు నమోదు చేసింది. అయితే జూలై 1న కవిత బెయిల్‌ పిటిషన్లను తిరస్కరిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ కవిత సుప్రీంను ఆశ్రయించారు. కాగా.. సోమవారం కవిత పిటిషన్‌పై వాదనలు జరగనుండగా.. సుప్రీం ధర్మాసనం ఎలాంటి తీర్పునిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.