అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్‌బీఐ చోరీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సోమవారం రాత్రి కిటికీ పగులగొట్టి లోనికి చొరబడ్డ దొంగలు గ్యాస్ కట్టర్ల సాయంతో లాకర్లు ధ్వంసం చేశారు. 19.5 కిలోల బంగారం ఎత్తుకెళ్లారు. జులాయి సినిమా తరహాలో చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. బ్యాంకులో రుణాల కోసం తాకట్టు పెట్టిన, లాకర్లలో రక్షణ కోసం ఉంచిన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. మొత్తం 497 మందికి చెందిన 19.5 కిలోల బంగారం చోరీ అయింది. ఈ ఆభరణాల విలువ రూ.13 కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాగా చోరీ విషయం తెలుసుకున్న ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే చోరీ చేసింది అంతర్రాష్ట్ర ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. వారి కోసం నాలుగు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో బ్యాంక్ సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.