అక్షరటుడే, హైదరాబాద్: SLBC Tunnel : ఎస్ఎల్బీసీ టన్నెల్లో మూడు మృతదేహాల స్పాట్స్ ను క్యాడవర్ డాగ్స్ గుర్తించినట్లు తెలిసింది. జీపీఆర్ ద్వారా మార్క్ చేసిన ప్రదేశంలోనే క్యాడవర్ డాగ్స్ నిలిచాయి. శుక్రవారం ఉదయం 7 గంటలకు రెండు కడావర్ డాగ్స్ కలిసి సొరంగంలోని ప్రమాద స్థలం వద్ద సహాయ బృందం కార్మికుల జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టింది.
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడ ఎంతకీ లభించకపోవడంతో కేరళ పోలీసు శాఖకు చెందిన కడావర్ డాగ్స్ ను రప్పించారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎన్డీఎంఏ), కేంద్ర హోంశాఖ కార్యదర్శి కల్నల్ కీర్తిప్రకాశ్ సింగ్ ఆధ్వర్యంలో రెండు సైనిక హెలికాప్టర్లలో ఆ శునకాలు, శిక్షకులను తీసుకొచ్చారు.
గతేడాది కేరళ(kerala)లోని మున్నార్ సమీపంలో పెట్టిముడి వద్ద కొండ చరియలు విరిగి మట్టిలో కూరుకుపోయిన నలుగురిని కడావర్ డాగ్స్ గుర్తించాయి. మట్టిలో 10-15 అడుగుల లోతులో కూరుకు పోయిన మానవ అవశేషాలను కూడా ఈ శునకాలు పసిగట్టగల సమర్థవంతమైనవి.
8 మంది కార్మికుల ఆచూకీ కోసం 14 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ ఉన్నా.. గల్లంతైన వారి జాడ ఇప్పటికీ లభించలేదు. 12 విభాగాలకు చెందిన దాదాపు 650 మంది సభ్యులు షిఫ్టుల వారిగా నిరంతం సహయక చర్యల్లో పాల్గొంటున్నారు. తాజాగా క్యాడవర్ డాగ్స్ ను లోకో ట్రైన్లో వాటిని సొరంగంలోకి తీసుకెళ్లారు. మధ్యాహ్నం రెండున్నరకు తిరిగి బయటకు తీసుకొచ్చారు. తప్పిపోయిన వారి ఆనవాళ్లకు సంబంధించి పలు అనుమానిత ప్రాంతాలను సదరు శునకాలు గుర్తించినట్లు చెబుతున్నారు.
టన్నెల్లోకి నలుగురు సభ్యులతో కూడిన ఎన్పీ రోబోటిక్ నిపుణుల బృందం కూడా వెళ్లింది. వీరితోపాటు ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ వెళ్లి అధ్యయనం చేశారు. మరోవైపు కన్వేయర్ బెల్ట్ వినియోగంలోకి రావటంతో సొరంగంలో సహయచర్యలు వేగవంతమయ్యాయి. మట్టి, బురదను తొలగిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే నిపుణులతో ప్లాస్మాకట్టర్స్ ద్వారా టీబీఎం మిషన్ భాగాలు కట్ చేస్తూ వాటిని లోకో ట్రైన్ ద్వారా బయటికి తీసుకొస్తున్నారు.