ఉపాధ్యాయురాలి సస్పెన్షన్..

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండలం కొండాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల బయోసైన్స్ ఉపాధ్యాయురాలు పద్మజను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన బదిలీల్లో పద్మజను సిరికొండ మండలంలోని కొండూరుకు బదిలీ చేశారు. ఆ వెంటనే మోడిఫికేషన్ పేరుతో అదే మండలం కొండాపూర్ పాఠశాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ సదరు ఉపాధ్యాయురాలు మాత్రం కొండూరు నుంచి రిలీవ్ కాలేదు. తనకు అన్యాయం జరిగిందని ఆరోపించడమే కాకుండా ఉపాధ్యాయ సంఘాలను ఆశ్రయించింది. అయితే ఎలాంటి తప్పిదం జరగలేదని డీఈవో పేర్కొన్నారు. కొండాపూర్ పోస్టింగులో జాయిన్ కావాల్సిందేనని తేల్చి చెప్పగా.. వివాదం మరింత ముదిరింది. ఈ అంశం రాష్ట్ర ఉన్నతాధికారుల వరకు వెళ్లడంతో విచారణ కొనసాగుతోంది. రెండ్రోజుల కిందట పద్మజను విధుల నుంచి తొలగిస్తూ.. డీఈవో ఉత్తర్వులు జారీ చేయడం చర్చకు దారితీసింది. ఈ విషయమై టీచర్ పద్మజ ఉన్నతాధికారులకు మరోమారు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.