అక్షరటుడే, కామారెడ్డి: కులగణన సర్వేలో తమకు కావాల్సిన ఆప్షన్ పై మాట్లాడేందుకు సీఎంతో అపాయింట్ మెంట్ ఇప్పించాలని లబానా సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ నాయక్ కోరారు. బుధవారం గ్రంథాలయ వారోత్సవాలకు హాజరైన షబ్బీర్ అలీని లబానా నాయకులు కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తాన్ సింగ్ మాట్లాడుతూ.. గత 15 రోజుల నుంచి కులగణన సర్వేలో తమకు లబానా ఆప్షన్ ఇవ్వాలని తిరుగుతున్నామని పేర్కొన్నారు. ఐదు జిల్లాల్లో తొమ్మిది నియోజకవర్గాల్లో 2 లక్షల మంది సర్వేను బహిష్కరించారని తెలిపారు. తమకు సీఎంతో మాట్లాడే అవకాశం ఇప్పించాలని షబ్బీర్ అలీని కోరామని, ఆయన చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ తో ఫోన్లో మాట్లాడారని పేర్కొన్నారు. ప్రస్తుతం సర్వేలో భాగస్వామ్యం కావాలని షబ్బీర్ అలీ కోరారని, ఆప్షన్ ఇచ్చేవరకు సర్వేలో పాల్గొనేది లేదని స్పష్టం చేసినట్టు తెలిపారు. సీఎంను కలిసేదాక ఇదే కంటిన్యూ అవుతుందని తెగేసి చెప్పారు.