అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: దేశీయ స్టాక్ మార్కెట్లో శుక్రవారం లార్జ్ కాప్ స్టాక్స్ వైల్డ్ మూవ్ చేశాయి. బుల్ రంకెలు వేయడంతో సెన్సెక్స్ 1,961పాయింట్లు, నిఫ్టీ 557 పాయింట్లు పెరిగాయి. ఐటీ, బ్యాంకింగ్, ఆటో స్టాక్స్ మార్కెట్ ను లీడ్ చేశాయి. శుక్రవారం ఉదయం 194 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్.. ఇంట్రాడేలో గరిష్టంగా 2,063 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 62 పాయింట్ల లాభంతో ప్రారంభమై గరిష్టంగా 607 పాయింట్లు పెరిగింది. చివరికి సెన్సెక్స్ 1,961 పాయింట్లు లాభపడి 79,117 పాయింట్ల వద్ద, నిఫ్టీ 557 పాయింట్లు లాభపడి 23,907 పాయింట్ల వద్ద ముగిశాయి. చాలా కాలం తర్వాత నిఫ్టీ 50లో బజాజ్ ఆటో మినహా మిగతా స్టాక్స్ అన్నీ లాభాలతో ముగియడం గమనార్హం. నిఫ్టీ 50లో చాలా స్టాక్స్ 2 శాతానికి పైగా పెరిగాయి. ఎస్బీఐ, టీసీఎస్, టైటాన్ 4 శాతానికి పైగా పెరగగా.. అల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ, టాటా కన్జ్యూమర్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్, ఎల్టీ, ఎల్టీఐఎం 3 శాతానికి పైగా లాభపడ్డాయి.