అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట మండల కేంద్రంలోని కట్టు కాలువ పరిస్థితి ఎవరికి పట్టని చందంగా మారింది. స్థానిక పెద్దవాగు నుంచి చీర్లపేర కుంట, స్వర్ణకుంటకు సాగు నీరందించే కాలువ కాస్త అధికారుల నిర్లక్ష్యం కారణంగా డ్రెయినేజీగా మారింది. దీనికితోడు కాలువలో పూడిక పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో గ్రామానికి చెందిన కొందరు యువకులు ‘మార్పు కోసం యువత’ సామాజిక మాధ్యమ వేదికగా కాలువ పరిస్థితిపై అధికారుల దృష్టికి తెచ్చారు. స్పందించిన గ్రామ పంచాయతీ అధికారులు రెండు రోజుల కిందట పూడికతీత పనులు చేపట్టి అర్థాంతరంగా నిలిపేశారు. దీంతో ఓ ఇంటి ముందు పెద్ద గుంత తవ్వి వదిలేయడంతో బయటికి వెళ్లే దారి లేక ఇబ్బంది పడుతున్నామని బాధితుడు సంగమేశ్వర్‌ తెలిపారు. ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు పూడికతీత పనులతో కాలనీవాసులకు తాగునీరందించే మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ దెబ్బతిని నీరందడం లేదు. ఇటు పంచాయతీ అధికారులు, అటు ఇరిగేషన్‌ అధికారులు తమ పరిధి కాదంటూ దాటవేస్తున్నారు. దీంతో అసలు కట్టు కాలువ కథ ఎవరికి చెప్పేదంటూ గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.