అందరి నోట.. శ్రీరాముడి మాట..!

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: పార్లమెంట్‌ ఎన్నికల వేళ అన్ని పార్టీలు రామనామాన్ని జపిస్తున్నాయి. ముఖ్య నేతల నోట రాముడి మాట వినిపిస్తోంది. దశాబ్దాలుగా దేశ ప్రజలు ఎదురుచూసిన అయోధ్య రామ మందిరం కల ఇటీవలే నెరవేరింది. ముఖ్యంగా ప్రధాని మోదీ హిందువుల చిరకాల స్వప్నాన్ని సాకారం చేశారని బీజేపీ అంటోంది. కాషాయ పార్టీ ఎన్నికల్లో రామ మందిరాన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా వాడుకుంటోంది. దశాబ్దాల కల కేవలం ప్రధాని మోదీ వల్లే సాధ్యమైందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు.

కొత్తగా కాంగ్రెస్ సైతం..

ఎన్నికల వేళ బీజేపీ దూకుడును గ్రహించిన కాంగ్రెస్ నేతలు కొత్తగా రామమంత్రాన్ని జపిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ సైతం తానూ హిందువునేనని ప్రకటించారు. సోమవారం నిజామాబాద్ లో జరిగిన బహిరంగ సభలోనూ రేవంత్ ఇదే విషయాన్ని నొక్కివక్కానించారు. తాను శ్రీరాముడిని పూజిస్తానని, శ్రీకృష్ణుడిని సైతం ఆరాధిస్తానని స్పష్టం చేశారు.

అదేబాటలో గులాబీ పార్టీ

బీఆర్ఎస్ నేతలు తాజా ఎన్నికల ప్రచారంలో రాముడి గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. కేటీఆర్ సైతం ఇటీవల పలు వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ లో మూడ్రోజుల కిందట జరిగిన సభలో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేకంగా రాముడి గురించి నాలుగైదు నిమిషాలు మాట్లాడడం ఇందుకు నిదర్శనం.

అయోధ్య ఎఫెక్ట్!

ఈ ఏడాది జనవరిలో అయోధ్యలో బాలరాముడు కొలువుదీరాడు. ఈ ఉత్సవాన్ని హిందూ సంఘాలు దేశవ్యాప్తంగా వేడుకలా జరుపుకున్నాయి. రాముల వారి అక్షింతలను ఇంటింటికి చేర్చాయి. రామ మందిరం అంశం బీజేపీకి జనాల్లో అడ్వాంటేజ్ గా మారింది. దీంతో కొత్తగా.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలు సైతం రామజపాన్ని మొదలుపెట్టాయి. తామూ.. రామ భక్తులమేనంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. ఎన్నడూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు శ్రీరాముడి పేరెత్తలేదని, కేవలం ఎన్నికల వేళ హిందువుల ఓట్ల కోసమే.. రామజపం చేస్తున్నారని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.