అక్షరటుడే, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. ఎఫ్ఐఐల అమ్మకాల ఒత్తిడితో కుదేలవుతున్న మన మార్కెట్లను అదానీ గ్రూప్ పై వచ్చిన ఆరోపణలు మరింత దెబ్బ తీశాయి. గురువారం ఉదయం సెన్సెక్స్ 133 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా వెంటనే నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో గరిష్టంగా 776 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో ప్రారంభమై ఇంట్రాడేలో గరిష్టంగా 255 పాయింట్లు పడిపోయింది. ఆ తర్వాత సూచీలు కాస్త తెరుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 422 పాయింట్ల నష్టంతో 77,155 పాయింట్ల వద్ద, నిఫ్టీ 168 పాయింట్ల నష్టంతో 23,349 పాయింట్ల వద్ద ముగిశాయి. నిఫ్టీ 50లో అదానీ ఎంటర్ ప్రైజెస్ గరిష్టంగా 22 శాతానికి పైగా నష్టపోయింది. అదానీ పోర్ట్స్ ఒక దశలో 20 శాతం పడిపోయి లోయర్ సెర్క్యూట్ తాకినా.. అదానీ గ్రూప్ ఇచ్చిన వివరణతో తేరుకుని చివరికి 13.57 శాతం నష్టంతో ముగిసింది. నిఫ్టీ 50లో దివిస్ ల్యాబ్, గ్రాసిమ్, హిందాల్కో, పవర్ గ్రిడ్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్టీఐఎం, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, కోటక్, టాటా స్టీల్ వంటి స్టాక్స్ పెరగగా.. ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, బీపీసీఎల్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, బ్రిటనియా, టైటాన్, డాక్టర్ రెడ్డి, ఎస్బీఐ లైఫ్, శ్రీరాం ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐచర్ మోటార్, టాటా మోటార్, ఐటీసీ, హెచ్ యూఎల్, రిలయన్స్ నష్టపోయాయి.