నిందితుడి అరెస్ట్.. రూ.13.50 లక్షల సొత్తు రికవరీ!

0

అక్షరటుడే, బాన్సువాడ: మద్నూర్ లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 24 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసి రూ.13.50 లక్షల సొత్తును రికవరీ చేశారు. బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ కేసు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. మద్నూర్ మండలంలో నివాసం ఉండే మహాజన్ బాలాజీ ఇంట్లో ఈనెల 26న రాత్రి చోరీ జరిగింది. బీరువాలో దాచి ఉంచిన 25 తులాల బంగారం, నగదు అపహరణకు గురయ్యాయి. ఇంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు బిచ్కుంద సీఐ నరేష్ ఆధ్యర్యంలో దర్యాప్తు చేపట్టారు. మద్నూర్ గ్రామానికి చెందిన ఉప్పరివార్ శ్రీను చోరీకి పాల్పడినట్లు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. దొంగతనం చేసినట్లు ఒప్పుకోగా అతడి నుంచి రూ.13.50 లక్షల సొత్తును రికవరీ చేశారు. నిందితుడిని రిమాండుకి తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన బిచ్కుంద సీఐ నరేశ్, ఎస్సై శ్రీకాంత్, సిబ్బంది సాయిబాబా గౌడ్, సాయిలు బృందాన్ని అభినందించారు.