అక్షరటుడే, జుక్కల్: నిజాంసాగర్ మండలంలోని మల్లూరు ఉన్నత పాఠశాలలో 9 మంది ఉపాధ్యాయులు ఉండగా.. శనివారం ఉదయం నలుగురు మాత్రమే హాజరయ్యారు. ఇదేమని ఆరాతీస్తే ఒక్క రోజే ఐదుగురు సెలవులో ఉన్నారని తెలిపారు. దీంతో కొన్ని తరగతుల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఖాళీగా కనిపించారు.

ఇలా..ఈ ఒక్కచోటే కాదు. మండలంలోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విధులకు సక్రమంగా హాజరు కావడంలేదు. మండలంలో ఏడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 9 ప్రాథమికోన్నత, 32 ప్రాథమిక పాఠశాలలు, ఇంకా కస్తూరిబా, ఆదర్శ, గురుకుల పాఠశాలలున్నాయి. మండల విద్యా శాఖాధికారికి అదనంగా మరో రెండు మండలాలు బాధ్యతలు ఉండడంతో పర్యవేక్షణ కరువైంది. ఫలితంగా మండలంలో విద్యా వ్యవస్థ గాడి తప్పింది.

సమయపాలన ఎరుగరు..

మండలంలో కొందరు ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదు. ఉదయం ప్రార్థనా సమయానికి సగం మంది ఉపాధ్యాయులు డుమ్మా కొడుతున్నారు. ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళ్తారో తెలియడం లేదు. ఉన్నతాధికారులు పర్యవేక్షణ కోసం వచ్చిన సందర్భంలో.. ఈరోజు సెలవు పెట్టారని చెబుతూ.. రోజుల తరబడి అనధికారిక సెలవులో ఉంటున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక కొందరు ఉపాధ్యాయులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉపాధ్యాయులు డుమ్మా కొట్టడంపై ఎంఈవో దేవిసింగ్ ను వివరణ కోరగా.. వరుస సెలవులు రావడం వల్లే ఉపాధ్యాయులు సెలవుపై వెళ్లి ఉండవచ్చని సమాధానం ఇచ్చారు.