అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock market | అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రారంభించిన టారిఫ్ వార్(Tariff war) రోజురోజుకు ముదురుతోంది. అమెరికా విధించిన సుంకాలకు దీటుగా చైనా స్పందించడం, దీనిపై యూఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అదనపు సుంకాలు విధించడంతో ఇది ఎక్కడికి దారితీస్తుందోనన్న భయాలు మార్కెట్లలో వ్యక్తమవుతున్నాయి. దీంతో మంగళవారం కాస్త కోలుకున్నట్లు కనిపించిన అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు.. అమెరికా(America), చైనాల మధ్య ఎడతెగకుండా కొనసాగుతున్న టారిఫ్ వార్‌తో మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికాకు చెందిన స్టాక్ మార్కెట్లు ఇంట్రాడేలో నాలుగు శాతం లాభాలనుంచి నష్టాల్లోకి జారుకున్నాయి. నాస్‌డాక్ 2.15 శాతం, ఎస్‌అండ్‌పీ 1.59 శాతం నష్టాలతో ముగిశాయి. డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.63 శాతం నష్టాలతో కొనసాగుతోంది. ఆసియా మార్కెట్లూ ఎరుపెక్కాయి. అత్యధికంగా జపాన్‌కు చెందిన నిక్కీ 2.69 శాతం నష్టంతో ఉండగా.. తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.97 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రేయిట్స్ టైవమ్స్ 1.84 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హంగ్‌సెంగ్ 1.76 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పి 0.53 శాతం నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. చైనా(China)కు చెందిన షాంఘై 0.25 శాతం నష్టంతో ఉంది. ఇతర దేశాల స్టాక్ మార్కెట్ల ప్రభావం మన మార్కెట్లపైనా కనిపించనుంది. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో గిఫ్ట్ నిఫ్టీ(Gift Nifty) 0.72 శాతం నష్టంతో కదలాడుతోంది. ఇది మన మార్కెట్లు కూడా భారీ నష్టాలతో ప్రారంభం అవకాశాలు ఉన్నట్లు సూచిస్తోంది.
Stock market | గమనించాల్సిన అంశాలు
చైనాపై అమెరికా అదనపు సుంకాలను విధించింది. దీనిపై చైనా కూడా దీటుగా స్పందించింది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని తగిన విధంగా స్పందించేందుకు అవసరమైన అన్ని శక్తులు తమ వద్ద ఉన్నాయని పేర్కొంది.
ట్రేడ్ వార్‌లో చైనా కరెన్సీ యన్(Yuan) పతనమవుతోంది. దీని ప్రభావం మన రూపాయిపైనా కనిపిస్తోంది. రెండు రోజుల్లోనే డాలర్‌తో మన రూపాయి విలువ 103 పైసలు పడిపోవడం గమనార్హం.
ఆర్‌బీఐ(RBI) ఎంపీసీ మీటింగ్‌కు సంబంధించిన వివరాలు ఉదయం 10 గంటల తర్వాత వెల్లడి కానున్నాయి. వడ్డీ రేట్లను 25 నుంచి 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తారని మార్కెట్ అంచనా వేసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆర్‌బీఐ అంచనాల మేరకు ప్రకటన చేస్తుందా లేదా కొంత వేచిచూసే ధోరణితో వ్యవహరిస్తుందా అన్న విషయంపై కొంత ఆందోళన నెలకొంది.
ఎఫ్‌ఐఐల అమ్మకాలు మంగళవారం కూడా కొనసాగాయి. నికరంగా రూ. 4,994 కోట్ల స్టాక్స్ అమ్మారు. డీఐఐలు మాత్రం నికరంగా రూ. 3,097 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
ఎఫ్‌ఐఐ(FII)లు లాంగ్ పొజిషన్ కాస్త తగ్గించుకున్నారు. ప్రస్తుతం నెట్ లాంగ్స్ 24 శాతం ఉండగా నెట్ షార్ట్స్ 76 శాతం ఉన్నాయి.