అక్షరటుడే, వెబ్డెస్క్ : HCU Lands | రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ వేడి రగిల్చిన కంచ గచ్చిబౌలిలోని హెచ్సీయూ భూ వివాదంపై కాంగ్రెస్(Congress) పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. భూముల వేలం వ్యవహారం చినికి చినికి గాలివానల మారడంతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ఏఐసీసీ(AICC) పెద్దలు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) శనివారం హైదరాబాద్ వచ్చారు. ఆ భూముల వ్యవహారంపై మంత్రులతో చర్చించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. హెచ్సీయూ(HCU) భూముల విషయంలో కమిటీ వేశామన్నారు. కమిటీ సభ్యులతో అన్ని విషయాలు చర్చించామని చెప్పారు. ఎవరికి నష్టం జరగకుండా వివాదాన్ని పరిష్కరించాలని తమ ఆలోచన అని ఆమె స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ఆరోపణలను పరిగణలోకి తీసుకొని.. వాస్తవాలను ప్రజలకు వివరిస్తామన్నారు. కాగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆమె ఢిల్లీ పెద్దలకు నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.