అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: పురుగుల అన్నం.. నీళ్ల చారు.. ఇదీ ఆ పాఠశాలలోని మెనూ…! అన్నం తిందామని ప్లేట్‌లో భోజనం పెట్టుకుంటే.. అది చూసి నోట్లో ముద్ద పెట్టుకోలేని పరిస్థితి. కొద్ది రోజులుగా విద్యార్థులు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకునే వారు లేకపోయారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం అధ్వానంగా మారింది. నిత్యం విద్యార్థులకు వడ్డించే భోజనంలో పురుగులు వస్తున్నాయి. అయితే పప్పు సైతం నీళ్లలా ఉంటోంది. పప్పుకు బదులు పిండి కలుపుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలు సైతం సరిగ్గా ఉండికించడం లేదని వాపోతున్నారు. బియ్యం సైతం రంగు మారినవి సరఫరా అవుతున్నాయి. భోజనం అధ్వానంగా ఉండడంతో చాలా మంది విద్యార్థులు సరిగ్గా తినలేక పారేస్తున్నారు.
గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి..
పాఠశాలలో సుమారు 600 మంది విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో నిత్యం 500 మంది వరకు హాజరవుతున్నారు. అయితే మధ్యాహ్న భోజనం సరిగ్గా ఉండకపోవడంతో కేవలం 300 మంది తింటున్నారు. గత కొన్నేళ్లుగా పాఠశాలలో ఇదే పరిస్థితి నెలకొందని.. అందుకే మధ్యాహ్న భోజనం తినలేకపోతున్నామని చెబుతున్నారు. పాఠశాలలో గత పదేళ్లుగా ఒకే వ్యక్తి మధ్యాహ్న భోజన ఏజెన్సీ నడుపుతున్నాడు. నిర్వాహకుడిపై గతంలోనూ పలుమార్లు ఫిర్యాదులు వచ్చాయి. విద్యార్థులకు మంచి భోజనం పెట్టాలని పాఠశాల హెచ్‌ఎంతో పాటు టీచర్లు అనేక సార్లు చెప్పినా పట్టించుకోకపోవడం గమనార్హం. వంట చేసే సమయంలో కూడా టీచర్లు పరిశీలించేందుకు వస్తే ఇక్కడకు రావొద్దని హెచ్చరిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలలో మెరుగైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.