నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం..

0

అక్షరటుడే, కామారెడ్డి: ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీఇచ్చారు. గురువారం ఆయన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్‌అలీతో కలిసి కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం అంతంపల్లి, జంగంపల్లి, దోమకొండ మండలం లింగుపల్లిలో పర్యటించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. అయితే పరిహారాన్ని రూ.15వేలు చెల్లించాలని ఆలోచన చేస్తున్నామని, ఇందుకోసం మరికొంత సమయం పడుతుందని తెలిపారు. అకాల వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలో ఎక్కువ మొత్తం పంట నష్టం జరిగిందని వివరించారు. జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్‌ షెట్కార్‌, ఎంపీపీ గాల్‌రెడ్డి, నాయకులు ఇంద్రకరణ్‌ రెడ్డి, కుంట లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.