అక్షరటుడే, ఇందూరు: బీఆర్‌ఎస్‌ నేతలు సోషల్‌ మీడియాలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. అవాస్తలు, ఆరోపణలను కాంగ్రెస్‌ కార్యకర్తలు తిప్పికొట్టాలని సూచించారు. రాజకీయ లబ్ధికోసం గ్రూప్‌-1 అభ్యర్థులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. నగరంలోని సోమవారం నుడా ఛైర్మన్‌గా కేశ వేణు బాధ్యతల స్వీకరణ అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పార్టీ రైతు రుణమాఫీ, రైతు భరోసా, డబుల్‌ బెడ్‌రూం అంశాలపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. పదేళ్ల పాలనలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణను అప్పుల్లోకి నెట్టిందన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఓటర్ల నమోదు ఉద్యమంగా చేపట్టాలని చెప్పారు.

ప్రజలతో మమేకమయ్యే పదవి..

నూడా ప్రజలతో మమేకమయ్యే పదవి అని మంత్రి జూపల్లి అన్నారు. కేశ వేణు 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉండడం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ తర్వాత అత్యంత పెద్ద జిల్లా నిజామాబాద్ అని, అభివృద్ధికి అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల్లో ఒకడిగా ఉండాలని కేశ వేణుకు సూచించారు. కార్యక్రమంలో పీపీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుగౌడ్‌ యాష్కీ, కార్పొరేషన్ల ఛైర్మన్లు, ఈరవత్రి అనిల్‌, మానాల మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి నాయకులు పాల్గొన్నారు.