అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నిర్మాణం పూర్తయిన డబుల్‌బెడ్రూం ఇళ్లలో సౌకర్యాలు కల్పించి, అర్హులైనవారికి త్వరలోనే కేటాయిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖతో కలిసి జిల్లాకు వచ్చిన ఆయన ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ హాజరు కాగా.. మంత్రి మాట్లాడారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 4 వేల ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. అనంతరం జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. ధరణి ఇబ్బందులు అధిగమించేందుకు ఆర్‌ఓఆర్ చట్టాన్ని నెలాఖరులోపు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ కార్డులు అందించేందుకు సర్వే చేపట్టామని, అన్నివర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సమావేశంలో రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.