అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే అనేక హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతుండడంతో.. ఓర్వలేక బీఆర్‌ఎస్‌ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి మండిపడ్డారు. శనివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌బిన్‌ హందాన్‌, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్‌, కేశ్ వేణుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చూసి తట్టుకోలేక కేటీఆర్‌, హరీశ్‌రావు అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రైతు రుణమాఫీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దేశంలోని ఏ రాష్ట్రం కూడా ఇప్పటివరకు ఇంతలా రుణమాపీ చేయలేదని పేర్కొన్నారు. రుణమాఫీ చేయడంలో ఎక్కడా అవినీతి జరగలేదని, రుణమాఫీ అవ్వని వారికోసం ప్రత్యేకంగా వ్యవసాయ అధికారులను నియమించామని తెలిపారు. నెల రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో రేషన్‌కార్డులు ఇవ్వలేదని, ఈ కారణంగానే కార్డు లేనివారికి రుణమాఫీ కాలేదని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇచ్చామని, ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని, రైతు రుణమాఫీ చేశామని, త్వరలో ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇస్తామని స్పష్టం చేశారు. ఇకనైనా బీఆర్‌ఎస్‌ నాయకులు బుద్ధి తెచ్చుకొని కాంగ్రెస్‌ ప్రభుత్వ పథకాలను స్వాగతించాలని హితవుపలికారు.