అక్షరటుడే, హైదరాబాద్: MLA quota : తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో ఈ నెల 29న పది ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. సోమవారం నుంచి ఈ నెల 10 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 11న నామినేషన్ల పరిశీలన చేపడతారు. 13న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఈ నెల 20న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ నిర్వహిస్తారు.
MLA quota : తెలంగాణలో ఐదు స్థానాలు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో ఐదు స్థానాలను భర్తీ చేయనున్నారు. ఎమ్మెల్యేల సంఖ్యా బలం ప్రకారం.. కాంగ్రెస్ నాలుగు, బీఆర్ఎస్ ఒక స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. ఒక ఎమ్మెల్సీ స్థానం గెలవాలంటే 21 మంది ఎమ్మెల్యేలు అవసరం. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాలు గెలుచుకుంది. అనంతరం కంటోన్మెంట్ ఎమ్మెల్యే చనిపోవడంతో ఉప ఎన్నికల్లో ఆ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది.
బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ప్రస్తుతం ఆ పార్టీ బలం 28కి చేరింది. ఈ లెక్కన ఒక్క స్థానం గెలిచే అవకాశం ఉంది.
MLA quota : వారి ఓటు ఎటో..
బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. వీరి అనర్హత పిటిషన్ ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. దీంతో వీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
MLA quota : ఖరారు కాని అభ్యర్థులు
నోటిఫికేషన్ వెలువడిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను పార్టీలు ఇంకా ప్రకటించలేదు. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది టికెట్ ఆశిస్తున్నారు. మెదక్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన నీలం మధుకు టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.
అలాగే జగ్గారెడ్డి కూడా కుసుమ కుమార్ కు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు పలువురు సీనియర్ నాయకులు సైతం టికెట్ దక్కించుకోవడానికి తమ ప్రయత్నాలు చేస్తున్నారు.
వారి మద్దతు ఎవరికో..
బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు, మజ్లిస్‌కు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీరు సొంతంగా పోటీ చేసే అవకాశం లేదు. దీంతో వీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారో తెలియాల్సి ఉంది.