అక్షరటుడే, బిచ్కుంద: రైతుల ఖాతాల్లో సోమవారం నుంచి రైతు భరోసా నిధులు జమవుతాయని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. బిచ్కుంద మండలం గుండె కల్లూరు గ్రామంలో ఆదివారం ‘రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల సంక్షేమ పథకాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలో అర్హులకు సంక్షేమ పథకాల పత్రాలను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. భూమిలేని రైతు కూలీలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని వారికి ప్రజా ప్రభుత్వం ఏడాదికి రూ.12 వేలు అందిస్తుందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు అర్హులకు మాత్రమే ఇస్తామని.. ఇందులో ఎటువంటి పైరవీలకు, అవినీతి జరగడానికి చోటు లేదని చెప్పారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదలకు కొత్త రేషన్‌కార్డులు ఇవ్వలేదని విమర్శించారు. నూతన రేషన్‌ కార్డుల జారీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. జాబితాలో పేరు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement