అక్షరటుడే, వెబ్‌డెస్క్: MLC Results : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా తీవ్రంగా శ్రమించారు. ఎలాగైనా గెలవాలని అనేక ప్రయత్నాలు చేశారు. ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సోమవారం నిర్వహించనున్నారు. దీంతో ఎవరు గెలుస్తారోనని ఉత్కంఠ నెలకొంది.
MLC Results : మూడు స్థానాలు
రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాల కోసం ఎన్నికలు జరిగాయి. కరీంనగర్–నిజామాబాద్–ఆదిలాబాద్–మెదక్ పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీతో పాటు వరంగల్–ఖమ్మం–నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించారు.
MLC Results : పోటీ వారి మధ్యే..
నిజామాబాద్–కరీంనగర్–ఆదిలాబాద్–మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. కాంగ్రెస్ నుంచి అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి, బీజేపీ నుంచి అంజిరెడ్డి పోటీ చేస్తున్నారు. వీరి గెలుపుకోసం పార్టీ కార్యకర్తలు కూడా తీవ్రంగా ప్రచారం చేశారు. వీరితో పాటు ప్రసన్న హరికృష్ణ, శేఖర్‌రావు సైతం ప్రభావం చూపే అవకాశం ఉంది.
MLC Results : బరిలో దిగని కాంగ్రెస్
ఎమ్మెల్సీ ఎన్నికలను బీఆర్ఎస్ లైట్ తీసుకుంది. అయితే కాంగ్రెస్ కూడా పట్టభద్రుల స్థానంలోనే పోటీ చేస్తోంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులను నిలపలేదు. బీజేపీ మాత్రం కరీంనగర్–నిజామాబాద్–ఆదిలాబాద్–మెదక్ టీచర్ స్థానానికి కొమురయ్యను పోటీలో దింపింది. ఆయన కూడా ప్రచారంలో దూసుకుపోయారు. నల్గొండ స్థానానికి బీజేపీ నుంచి సర్వోత్తమ్‌రెడ్డి పోటీచేశారు. దీంతో ఆయా స్థానాల్లో ఉపాధ్యాయ సంఘాల నేతల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది.
MLC Results : 50 శాతం దాటితేనే గెలిచినట్లు
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ వేరుగా ఉంటుంది. ఇతర ఏ ఎన్నికల్లో అయినా ఎక్కువ ఓట్లు వచ్చిన వారు గెలిచినట్లు ప్రకటిస్తారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలంటే 50శాతం కంటే అదనంగా ఓట్లు రావాలి. మొదటి ప్రాధాన్యత ఓట్లలో 50 శాతం రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. అప్పుడు కూడా 50శాతం రాకపోతే మూడో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. పోటీ తీవ్రంగా ఉండటం, అభ్యర్థులు అధికంగా ఉండటంతో మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందడం కష్టమే. ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఫలితాలు తేలేవరకు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.