అక్షరటుడే, ఇందూరు: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం పసుపు పంట క్వింటాలుకు రూ.12 వేల మద్దతు ధర ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. లేకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. శనివారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆమె పర్యటించారు. పసుపు రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులకు కష్టానికి తగ్గ ఫలితం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు క్వింటాలుకు రూ.8 వేల నుంచి రూ.10 వేలు మాత్రమే ధర చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రూ.12 వేలు మద్దతు ధర ఇవ్వాలని, లేదంటే మిగతా డబ్బులు బోనస్ రూపంలో అందించాలని డిమాండ్ చేశారు. దళారులు, అధికారులు పాలకవర్గం సిండికేట్‌గా మారి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటేనన్నారు. తెలంగాణకు రావాల్సిన నీళ్లు ఏపీకి వెళ్తున్నాయని ఆరోపించారు. తన విషయంలో సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. మాజీ మేయర్ నీతు కిరణ్, నుడా మాజీ ఛైర్మన్ ప్రభాకర్, అలీం తదితరులు పాల్గొన్నారు.