అక్షరటుడే, వెబ్డెస్క్ : MLC Kavitha | ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో పార్టీలు గెలిచాయని.. ప్రజాస్వామ్యం ఓడిపోయిందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు బీసీయేతర అభ్యర్థులను బరిలో నిలిపాయన్నారు. బీసీలు ఏకతాటిపైకి రావడంతో బీసీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు భారీగా ఓట్లు పడ్డాయని ఆమె పేర్కొన్నారు. పార్టీలపరంగా, సిద్ధాంత పరంగా ఓట్లు చీలడంతోనే ఆయన ఓడిపోయారన్నారు.
MLC Kavitha | మూడు బిల్లులు పెట్టాలి
చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు ఉండాలని కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లపై మూడు బిల్లులు పెట్టాలన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ల పెంపునకు వేర్వేరు బిల్లులు పెట్టాలన్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్ కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలో ఉంటుందని ఆమె వివరించారు.
MLC Kavitha | రాష్ట్రం పరిధిలోనే..
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అంశం రాష్ట్రం పరిధిలో ఉంటుందని కవిత అన్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి కేసీఆర్ రాష్ట్రస్థాయిలోనే చట్టం తెచ్చారని ఆమె గుర్తు చేశారు. రాష్ట్రస్థాయిలో చట్టం ద్వారా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచొచ్చని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు.
మూడు అంశాలను ఒకే బిల్లులో పెట్టి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను పెంచకుండా కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇలా చేస్తే న్యాయ వివాదం తలెత్తే అవకాశం ఉందన్నారు. జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు సంబంధించిన అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని ఆమె సూచించారు.