అక్షరటుడే, వెబ్‌డెస్క్: RUSSIA UKRAINE WAR : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు అమెరికా, ఐరోపా దేశాలు యత్నిస్తున్న వేళ ఉక్రెయిన్‌పై రష్యా దారుణంగా విరుచుకుపడింది. సుమీ నగరంపై రష్యా వేసిన క్షిపణి దాడిలో 30 మందికి పైగా మృతి చెందారని అధికారులు తెలిపారు. 83 మందికి పైగా గాయపడినట్టు పేర్కొన్నారు. పామ్ సండే పండగ సందర్భంగా స్థానికులంతా ఒకచోట చేరిన వేళ రష్యా రెండు క్షిపణులతో దాడి చేసినట్లు చెప్పారు.
ఘటనాస్థలంలో చెల్లాచెదురుగా మృతదేహాలు పడి ఉన్న దృశ్యాలను ఉక్రెయిన్ విడుదల చేసింది. దాడుల నిలిపివేతకు రెండు దేశాల మధ్య అమెరికా ఇంతకు ముందు మధ్యవర్తిత్వం వహించిన విషయం తెలిసిందే. ఆ చర్చల సందర్భంగా తాత్కాలిక ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఉక్రెయిన్, రష్యా అగ్ర దౌత్యవేత్తలు పరస్పరం ఆరోపించుకున్నారు. ఇది జరిగిన కొన్ని గంటలకే దాడులు జరిగాయి.
సుమీ నగరంపై దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Ukrainian President Zelensky) ఖండించారు. సాధారణ పౌరులను రష్యా లక్ష్యంగా చేసుకుందన్నారు. ఈ దాడుల్లో భవనాలు, విద్యాసంస్థలు, కార్లు ధ్వంసమయ్యాయని మండిపడ్డారు. పదుల సంఖ్యలో ప్రజలు మృతి చెందారన్నారు. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు స్పందించాలని జెలెన్‌స్కీ విన్నవించారు.
మాస్కో(Moscow) విషయంలో చర్చలు ఎప్పుడూ క్షిపణులు(missiles), వైమానిక దాడులను నిలువరించలేకపోయాయని జెలెన్‌స్కీ తెలిపారు. ఓ ఉగ్రవాదితో ఏ విధంగా వ్యవహరిస్తారో రష్యా పట్ల అలాంటి వైఖరి అవసరమని చెప్పారు. రష్యాపై ఒత్తిడి లేకుండా శాంతి స్థాపన అసాధ్యమన్నారు.