అక్షరటుడే, ఆర్మూర్: మోర్తాడ్, బాల్కొండ, ఆర్మూర్, లక్ష్మణ్ చాంద పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 15.7 తులాల బంగారు అభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ బస్వారెడ్డి వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లాకు చెందిన అబ్దుల్ సాజిద్, పాతూరి తరుణ్, డిచ్పల్లి కి చెందిన బోయర్ శంకర్, నిజామాబాద్ మిర్చి కాంపౌండ్ కు చెందిన సాయికుమార్ ఓ ముఠాగా ఏర్పడ్డారు. వరుసగా చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డారు. ఇటీవల వాహనాల తనిఖీల్లో భాగంగా మోర్తాడ్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా గొలుసు చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి బంగారు నగలు సీజ్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏసీపి తెలిపారు. కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన మోర్తాడ్ ఎస్సై అనిల్ రెడ్డి, సిబ్బంది సురేష్, నారాయణ, నవీన్ చంద్రను ఏసీపీ అభినందించారు. ఈ సమావేశంలో భీంగల్ సీఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.