అక్షరటుడే, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం లేదని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి అన్నారు. కొనుగోళ్ళు ప్రారంభించిన చోట కడ్తా పేరిట రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఆర్మూర్ పట్టణంలో చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒకవైపు అకాల వర్షాలతో ధాన్యం తడిసి పోతోందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచడం లేదన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. రైతులను నిండా ముంచిందని ఆరోపించారు. రూ.500 బోనస్ ఏమైందని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో రైతులంతా ఏకమై కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. కేవలం బీజేపీతోనే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. కేంద్రం నిర్ణయాలతో పసుపు రైతులు సంతోషంగా ఉన్నారని, తిరిగి బీజేపీ అధికారంలోకి రాగానే నిజాంషుగర్స్ ఫ్యాక్టరీలు తెరిపించి చెరకు రైతులకు మంచి రోజులు తెస్తామని హామీ ఇచ్చారు.