అక్షరటుడే, వెబ్ డెస్క్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థుడే కానీ, కాంగ్రెస్‌ది అసమర్థ ప్రభుత్వమని ఎంపీ అర్వింద్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ బీజేపీలో చేరుతారంటూ వస్తున్న వార్తలపై స్పందించారు. రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతానంటే స్నేహపూర్వకంగా ఆహ్వానిస్తానని, ఆయనకు మరో 15 ఏళ్లు రాజకీయ జీవితం కనపడుతోందన్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీకి మాత్రం భవిష్యత్తు లేదన్నారు. రేవంత్ పాల్గొన్న ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమం ఓ కామెడి షోగా జరిగిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. సకాలంలో వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని, మరోవైపు అకాల వర్షాలకు పంట నష్టపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. రూ.500 బోనస్ చెల్లించి వడ్లు కొంటామని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పటివరకు బోనస్‌పై ఎందుకు ప్రకటన చేయట్లేదని ప్రశ్నించారు. కరెంట్ బిల్లులు కూడా రెట్టింపుగా ఇస్తూ.. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 30కి మించి సీట్లు రావన్నారు. ఎన్డీయేకు 400 పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తంచేశారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో పసుపు రైతులు మోదీపై అభిమానంతో బీజేపీకి లక్ష ఓట్లు వేయనున్నారని తెలిపారు. గతం కంటే భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.