అక్షరటుడే, ఇందూరు: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైల్వే అండర్ బ్రిడ్జి పనులు ఆలస్యంగా సాగుతున్నాయని ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. మంగళవారం కలెక్టరేట్ లో అధికారులతో నిర్వహించిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశంలోనే అత్యధికంగా ఆర్వోబీలు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మంజూరయ్యాయని తెలిపారు. ప్రధానంగా మాధవ నగర్ బ్రిడ్జికి రూ. 93 కోట్ల నిధులు విడుదలయ్యాయని వివరించారు. ఆరు నెలల క్రితం రూ.10 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే ఇప్పటివరకు స్పందించలేదన్నారు. కనీసం పనులు చేసిన కాంట్రాక్టర్లకు కూడా డబ్బులు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అవగాహన లేకుండా ఆర్వోబీలు గురించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ముందు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులపై శ్రద్ధ చూపాలని సూచించారు. నిధులన్నీ ఇతర జిల్లాలకు మళ్లిస్తున్నారని, జిల్లా మీద ప్రేమ ఉంటే అభివృద్ధికి కృషి చేయాలన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు. కాంగ్రెస్ అదే దారిలో నడుస్తోందంటూ మండిపడ్డారు. మహేశ్ కుమార్ గౌడ్ ఎప్పుడూ ఎన్నికల్లో గెలవలేదని కనీసం పెద్ద పదవి వచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యేలా చూడాలన్నారు. ఇక అర్సపల్లి బ్రిడ్జికి రూ.135 కోట్లలో 90 శాతం రైల్వే నిధులు మంజూరయ్యాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ. 4.5 కోట్ల నిధులు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయని గుర్తు చేశారు. అలాగే మూడున్నర ఎకరాల స్థలం అవసరముండగా.. ఇప్పటికీ కేటాయించలేదన్నారు. ప్రధానంగా అడవి మామిడిపల్లి రైల్వే బ్రిడ్జికి ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదని, అయినా కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారని చెప్పారు.