అక్షరటుడే, ఇందూరు: అబద్ధపు హామీలతో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్‌లో శుక్రవారం రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయాన్ని పూర్తిగా విస్మరించారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు పూర్తిగా బుట్టదాఖలు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద బడ్జెట్ లేదని.. అందుకే రూ. రెండు లక్షల రుణమాఫీ ఇప్పటివరకు అమలు చేయలేదని గుర్తు చేశారు. రైతులను మోసం చేస్తే సీఎం రేవంత్ రెడ్డి కుర్చీకి గ్యారంటీ ఉండదన్నారు. రాజ్యాంగంలో పదవీకాలం ఐదేళ్లు ఉంటే.. రైతు రాసిన రాజ్యాంగంలో ఐదు నెలలు కూడా ఉండదని హెచ్చరించారు. రైతులకు రూ.500 బోనస్ కూడా ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో చూస్తే నవ్వొస్తుందన్నారు. కిసాన్ న్యాయ్ పేరుతో స్వామినాథన్ ఫార్ములా ప్రకారం చట్టబద్ధత కల్పిస్తామంటూ.. మేనిఫెస్టోలో చేర్చారని విమర్శించారు. ఇన్నేళ్లుగా ఏం చేశారని ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన కంటే మోదీ పాలనపైనే ప్రజలకు అపార విశ్వాసం ఉందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరుకోవడం మోదీ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. దీక్షలో కిసాన్ మోర్చా అధ్యక్షుడు తిరుమల్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, రాష్ట్ర నాయకులు పల్లె గంగారెడ్డి, పెద్దోళ్ల గంగారెడ్డి, మోహన్ రెడ్డి, పి.లక్ష్మీనారాయణ, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ స్రవంతి రెడ్డి, గద్దె భూమన్న, పార్లమెంట్ ప్రబారి వెంకటరమణి, న్యాలం రాజు కార్పొరేటర్లు, రైతులు పాల్గొన్నారు.