అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: ఏసీబీ దాడులతో మున్సిపల్ అధికారి నరేందర్ అక్రమాల పుట్ట ఒక్కొక్కటిగా బయట పడుతోంది. పాతికేళ్లుగా నిజామాబాద్ కార్పొరేషన్‌లో పాతుకుపోయిన నరేందర్ రెవెన్యూ విభాగంలో అన్నీ తానై నడిపించాడు. కమిషనర్ ఎవరు ఉన్నా.. స్థానిక నేతలు ఎవరైనా ఈయన బుట్టలో పడాల్సిందే..! ఇలా.. ఒకటి కాదు, రెండు కాదు. ఏకంగా రూ.కోట్లల్లో అక్రమాస్తులు కూడగట్టుకున్నాడు. శుక్రవారం నాటి ఏసీబీ సోదాల్లో రూ.6.7 కోట్ల అక్రమాస్తులు గుర్తించారు. కాగా ఇందులో ఉన్న 17 స్థిరాస్తి డాక్యుమెంట్ల ప్రభుత్వ మార్కెట్ విలువ రూ.1.98 కోట్లు. కానీ, బహిరంగ మార్కెట్ విలువ రూ.20 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇందులో రూరల్ మండలంలో ఆరెకరాల వ్యవసాయ భూమి, నగరంలో ఖరీదైన ఓపెన్ స్థలాలున్నాయి. పలువురు కుటుంబ సభ్యులపైనా తన బినామీ ఆస్తులను దాచి ఉంచారని ప్రచారంలో ఉంది. వాటిపైనా ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. మాములు ఉద్యోగిగా అడుగుపెట్టి ప్రస్తుతం బడాబాబులను తలదన్నేలా రూ.కోట్లకు పడగలెత్తడం సర్వత్రా చర్చకు దారితీసింది. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కాగా.. బ్యాంకు ఖాతాలో రూ.కోటికి పైగా నగదు ఉంచడం గమనార్హం. ముఖ్యంగా రెండు ఇళ్లు, పెద్దబజార్‌లో ఓ కమర్షియల్ బిల్డింగ్ ఉన్నప్పటికీ.. తాను అద్దె ఇంట్లో ఉంటున్నట్లు ఐటీ శాఖకు తప్పుడు పత్రాలు చూపిస్తున్నట్లు సమాచారం. తీగ లాగితే డొంక కదిలినట్లు.. నరేందర్ అవినీతి చిట్టా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుండడం చూసి విచారణ అధికారులే ఆశ్చర్యానికి లోనవుతున్నారు.