అక్షరటుడే, వెబ్‌డెస్క్: Expressway : మహారాష్ట్ర రహదారి అభివృద్ధి సంస్థ(MSRDC) 802 కి.మీ. పొడవైన నాగ్‌పూర్-గోవా శక్తిపీఠ్ ఎక్స్‌ప్రెస్‌వే భూసేకరణ సర్వేను మళ్లీ ప్రారంచేందుకు సిద్ధం కావడం ప్రస్తుతం చర్చనీయంగా మారింది. గత సంవత్సరం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు తీవ్ర నిరసనల కారణంగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ ప్రాజెక్టును ముఖ్యంగా రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. తగిన పరిహారం, పర్యావరణ ప్రభావ అధ్యయన లోపం వంటి అంశాలపై కూడా ఆందోళన వ్యక్తమైంది.
Expressway : ఆ మూడు జిల్లాల్లోనే అత్యధికం..
ఎన్నికలు ముగిసిన తర్వాత, తాజాగా సర్వేను తిరిగి ప్రారంభించనున్నట్లు MSRDC అధికారులు ధృవీకరించారు. అయితే, కోల్హాపూర్ జిల్లాను ప్రస్తుతం సర్వే నుంచి మినహాయించారు. కోల్హాపూర్, సోలాపూర్, సాంగ్లీ జిల్లాల్లో(Kolhapur, Solapur, Sangli) గతేడాది జూన్ లో తీవ్ర వ్యతిరేకత ఎదురైన కారణంగా సెప్టెంబరులో భూసేకరణ ప్రక్రియ నిలిపివేశారు. మొత్తం 27,000 ఎకరాల భూమి అవసరమైన ఈ ప్రాజెక్టులో 9,500 ఎకరాలను కోల్హాపూర్, సోలాపూర్, సాంగ్లీ జిల్లాల నుంచే సేకరించాల్సి ఉంది.
Expressway : 2029 నాటి కల్లా..
“సర్వే పూర్తి అయిన వెంటనే భూసేకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది, ఇది కొన్ని నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నాం” అని ఒక అధికారి తెలిపారు. 2029 చివరికల్లా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణాన్ని పూర్తి చేయాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
Expressway : సగం సమయం ఆదా..
ప్రస్తుతం నాగ్‌పూర్-గోవా(Nagpur-Goa) మధ్య ప్రయాణ సమయం 21 గంటలు పడుతోంది. నాగ్‌పూర్-గోవా శక్తిపీఠ్ ఎక్స్‌ప్రెస్‌వే పూర్తయితే.. ఆ సమయం 10.5 గంటలకు తగ్గనుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే మహారాష్ట్రలోనే అతి పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే అవుతుందని అంచనా. అలాగే.. తెలంగాణ నుంచి గోవా వెళ్లాలనుకునే వారికి ఈ హైవేనే కీలకం కానుంది.
Expressway : కాంగ్రెస్ అడ్డగింత..
ఈ ఎక్స్‌ప్రెస్ వే వార్ధా, యవత్మాల్, హింగోలి, నాందేడ్, పరభణి, లాతూర్, బీడ్, ధారాశివ్(ఉస్మానాబాద్), సోలాపూర్, సాంగ్లీ, కోల్హాపూర్, సింధుదుర్గ్ జిల్లాల మీదుగా ప్రయాణించనుంది. ముఖ్యంగా కోల్హాపూర్‌లో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. సతేజ్ పాటిల్ నేతృత్వంలో ఈ ప్రాంత రైతులు ఉద్యమిస్తున్నట్లు సమాచారం. లాతూర్ జిల్లాలోనూ భూసేకరణకు వ్యతిరేకంగా జనవరి 24న తహసిల్దార్ కార్యాలయాల వద్ద రైతులు నిరసనలు చేపట్టారు.
ఈ ప్రాజక్టుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనలు ప్రకటించింది. “ఇప్పటికే ఉన్న రూట్లు సరిపోతాయని, రైతులను నిర్వాసితులను చేసే ప్రాజెక్టు అవసరం లేదు,” అనేది ఆ పార్టీ నేతల వాదన. రోడ్లపై ఉద్యమిస్తామని మహారాష్ట్ర శాసన మండలి సభ్యుడు (MLC) సతేజ్ పాటిల్ హెచ్చరించారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మార్చి 12(రేపు)న అసెంబ్లీ వద్ద భారీ నిరసన ప్రదర్శన జరపనున్నారు.
Expressway : ఎక్స్‌ప్రెస్‌వే మార్గం ఇలా..
ఈ ఎక్స్‌ప్రెస్‌వే వార్ధా సమీపంలోని పవనార్ నుంచి ప్రారంభమై, గోవాలోని పత్రదేవి వరకు విస్తరించనుంది. పవనార్ వద్ద ఇది ముంబై-నాగ్‌పూర్ సమృద్ధి మహామార్గంతో కలిసిపోయి, కనెక్టివిటీని మెరుగుపర్చుతుంది. మహారాష్ట్ర అధికారులు ఇటీవల గోవా ప్రభుత్వంతో సమావేశమయ్యారు. మోపాలోని మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో అదనపు కిలోమీటర్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరారు.