Posani Krishna Murali : సినీ నటుడు, నిర్మాత పోసాని కృష్ణ మురళి కొద్ది నెలల క్రితం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పల్నాడు జిల్లా టిడిపి నేత కొట్టా కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసి కోర్టుకి హాజరు పరచిన విషయం తెలిసిందే. అయితే వైసీపీ లీగల్ టీమ్ న్యాయవాది రాప్రోలు శ్రీనివాసరావు పోసాని తరఫున వాదనలు వినిపించగా నరసరావుపేట కోర్టు మేజిస్ట్రేట్ వారు బెయిల్ మంజూరు చేశారు. దాంతో పాటు రూ.10 వేలు పూచీకత్తు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
Posani Krishna Murali : కాస్త రిలీఫ్..
మరోవైపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు పోసాని. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరారు. ఇప్పటి వరకు పోసానిపై మొత్తం 16 కేసులు నమోదవ్వగా.. ఐదు కేసుల్లో అతనికి ఉపశమనం లభించింది. పాలకొండ, భవానీపురం, పాడేరు, విశాఖ, పట్టాభిపురంలో నమోదైన కేసులను క్వాష్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు పోసాని. ప్రాసిక్యూషన్ అభ్యర్థన మేరకు విశాఖ వన్‌టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసుపై విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. అప్పటివరకు పిటిషనర్‌పై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టం చేసింది.
పోలీసుల తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) సాంబశివప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ..కోర్టు ముందు విచారణకు ఉన్న మూడు కేసులలో పీటీ వారెంట్ అమలుకాలేదంటూ చెప్పుకొచ్చారు. భవానీపురం పోలీసులు పెట్టిన కేసులో పీటీ వారెంట్ అమలైనందున కేసును కొట్టివేయాలని కోరారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి దీనిపై స్పందిస్తూ..పిటిషనర్‌పై బీఎన్‌ఎస్ సెక్షన్ 111 వ్యవస్థీకృత నేరం కింద విశాఖ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు చెప్పుకొచ్చారు. పిటిషనర్‌కు ఈ సెక్షన్ వర్తించదని తెలిపారు. ప్రాసిక్యూషన్ జోక్యం చేసుకుంటూ పిటిషనర్‌పై ఇప్పటికే మూడు చార్జిషీట్లు దాఖలయ్యాయని, వివరాలు కోర్టు ముందు ఉంచేందుకు సమయం ఇవ్వాలని కోరారు. దీనికి న్యాయమూర్తి అంగీకరించారు.