అక్షరటుడే, ఇందూరు: MP ARVIND | జిల్లాలో కావాలనే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నవోదయ విద్యాలయాన్ని అడ్డుకున్నారని, కాంగ్రెస్ వల్లే విద్యాలయం వెనక్కి వెళ్లిందని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. శనివారం నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లతో నవోదయ విద్యాలయం ఏర్పాటు కోసం సమ్మతించిందన్నారు. అయితే రూరల్ నియోజకవర్గంలో విద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు స్థలం కూడా చూపించారన్నారు. కానీ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వివాదాల్లో ఉన్న బోధన్ షుగర్ ఫ్యాక్టరీ భూములను చూపించి విద్యాలయాన్ని అడ్డుకున్నారన్నారు. జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నిర్వాకం కారణంగా నవోదయ వెనక్కి వెళ్లిందన్నారు.
MP ARVIND | ఈగోతోనే అడ్డుపడ్డారు..
కేవలం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి తన ఈగోతోనే అడ్డుకున్నారని ఎంపీ ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి సైతం స్థలం కోసం సత్వరమే అనుమతులు ఇవ్వాలని ఆదేశాలిచ్చారన్నారు. కావాలనే సుదర్శన్ రెడ్డి వివాదాస్పద స్థలం చూపించి నదోదయను జిల్లాకు రాకుండా చేశారని స్పష్టం చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి అడిగినప్పటికీ.. కాదని చెప్పి రూరల్ నియోజకవర్గంలో నవోదయ ఏర్పాటుకు స్థలం చూశామని.. బీజేపీ త్యాగం చేసినా కాంగ్రెస్ నాయకులు అడ్డుకట్ట వేసి నవోదయను జిల్లాకు రాకుండా చేశారని వెల్లడించారు.
MP ARVIND | రిజక్ట్ అవుతుందని తెలిసీ ప్రపోజల్..
బోధన్ ఎన్ఎస్ఎఫ్ భూములు వివాదాస్పదంగా ఉన్నాయని బోధన్ ఎమ్మెల్యేకు తెలిసినా కావాలనే నవోదయకు ఆ స్థలాలను చూపించారన్నారు. ఎన్ఎస్ఎఫ్ భూములు ప్రైవేట్ అని ఎమ్మెల్యేకు తెలిసినా ప్రపోజల్స్ పంపడంలో ఆంతర్యమేమిటో తెలియట్లేదన్నారు.
MP ARVIND | సమాజంలో చీడపురుగులు..
సమాజంలో చీడ పురుగులుగా కాంగ్రెస్ నాయకులు మారారని ఎంపీ పేర్కొన్నారు. రూ. 100 కోట్లతో ఒక మంచి విద్యాలయం జిల్లాకు వస్తోదంటే.. స్వాగతించాల్సింది పోయి అడ్డుపుల్లలు వేశారని మండిపడ్డారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అవగాహనలేమితో ప్రైవేట్ స్థలాన్ని అధికారులకు చూపి నవోదయ రాకుండా చేశారన్నారు.
MP ARVIND | ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా నుంచి అత్యధిక ఓట్లు..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి జిల్లా నుంచి 85 శాతం ఓట్లు పడ్డాయని ఎంపీ పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో తెలిసిపోతుందని వివరించారు. కాంగ్రెస్ నాయకులకు నమ్ముకుంటే సాధారణ కార్యకర్తలకు పుట్టగతులు ఉండవని స్పష్టం చేశారు. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేనని చెప్పుకునే సుదర్శన్ రెడ్డి కనీసం క్రీడాకారుల కోసం స్టేడియం కోసం ప్రయత్నం చేయట్లేదని విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.