అక్షరటుడే, ఇందూరు: అబద్ధపు మాటలు, చిల్లర రాజకీయాలతో రేవంత్ రెడ్డి 420గా మిగిలిపోతారని అరవింద్ ధర్మపురి వ్యాఖ్యానించారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. మోదీ గుజరాత్ నుంచి వచ్చాడంటూ రేవంత్ మాట్లాడడం తగదన్నారు. మరి రేవంత్ రెడ్డి కూడా పాలమూరు నుంచి వచ్చిన వాడేనని పేర్కొన్నారు. దేశం కోసం మోదీ రాజకీయాల్లోకి వచ్చారని.. కాంగ్రెస్ నాయకుల్లాగా ఎలాంటి ఆశతో రాలేదన్నారు. ఆయన ప్రధాని అయ్యాక అనేక సమస్యలు పరిష్కారమయ్యాయని, ముఖ్యంగా కశ్మీర్ కూడా అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. కేవలం ఒక్క ఫోటోతో మాల్దీవ్స్ ని ఉక్కిరిబిక్కిరి చేసిన నేత మోదీ అని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. హామీలపై ప్రజల దృష్టి మరల్చడానికే రిజర్వేషన్ల గురించి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముస్లింలకు ఈడబ్ల్యూఎస్ రూపంలో రిజర్వేషన్లు ఇచ్చిందే మోదీ అని గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులు ఒకరికొకరు పొంతన లేకుండా హామీలపై మాట్లాడుతున్నారన్నారు. పసుపు బోర్డుపై గెజిట్ వచ్చాక కూడా రాలేదని సీఎం రేవంత్ అనడం సిగ్గుచేటన్నారు. కచ్చితంగా ఇందూరులోనే బోర్డు కార్యాలయం ఉంటుందని స్పష్టం చేశారు. రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేయడం చేతకాక తమ పార్టీపై ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అవసరమైతే వారే దాడులు చేయించుకుని బీజేపీపై రుద్దే ప్రయత్నంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తాను మరోసారి భారీ మెజార్టీతో గెలుస్తానని అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, రాష్ట్ర నాయకులు పల్లె గంగారెడ్డి, మోహన్ రెడ్డి, జిల్లా నాయకులు శంకర్, స్రవంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.