అక్షరటుడే, వెబ్ డెస్క్: గులాబీ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కార్యక్రమాలకు వెళ్లొద్దంటూ.. అర్బన్ నేత ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాత్రి పార్టీ సీనియర్లు కొందరితో సమావేశమైన సదరు నేత.. ‘మీరు నాకు తెలియకుండా బాజిరెడ్డి కార్యక్రమాలకు ఎలా వెళ్తారు? రైతు ధర్నాలో ఎందుకు పాల్గొన్నారు. నేను పార్టీ పదవులు ఇప్పిస్తే మరొకరి కోసం ఎలా తిరుగుతారు’ అని వ్యాఖ్యానించారు. సదరు నేత మాటలతో సీనియర్లు కంగు తిన్నారు. అదేమిటీ.. తాము వెళ్లింది సొంత పార్టీ అభ్యర్థి కార్యక్రమాల కోసమేనని సమాధానం చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకపోవడం కొసమెరుపు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత అనేక మంది ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అర్బన్ నియోజకవర్గంలోనూ సదరు నేత అందలం ఎక్కించిన వారంతా ఆయనకు ‘చేయి’చ్చి వెళ్లారు. కానీ.. ఉద్యమ కాలం నుంచి ఉన్నవారు తమకు ఎలాంటి పదవులు దక్కకపోయినా ఇంకా గులాబీ పార్టీ వెన్నంటే ఉన్నారు. ఇంతలోనే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో పార్టీ అభ్యర్థి కోసం పని చేస్తున్నారు. అయినా వారిని నిరుత్సాహ పరిచేలా అర్బన్ నేత వ్యాఖ్యలు చేయడం పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది.
అంతుచిక్కని తీరు..
అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవాన్ని మూటగట్టుకున్న బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ లోటును భర్తీ చేసుకునేలా అభ్యర్థులను ఎంపిక చేసింది. గెలుపు ఓటములు పక్కనపెడితే ఎన్నికల్లో ప్రభావం చూపే అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది. ఈ క్రమంలోనే నిజామాబాద్ టికెట్ బీసీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ కు కట్టబెట్టింది. అయితే ఈ టికెట్ ను అర్బన్ నేతతో పాటు పలువురు ఆశించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేయాల్సిన నేతలు ఇలా.. ఎంపీ అభ్యర్థి కార్యక్రమాలకు వెళ్ళొద్దంటూ నాయకులకు హుకుం జారీ చేయడం వెనుక మర్మమేమిటో పార్టీ శ్రేణులకు అంతు చిక్కడం లేదు.
గతంలోనే కవిత వ్యాఖ్యలు..
నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో వర్గపోరు ఆ పార్టీ అధికారంలో ఉన్న నాటి నుంచే నడుస్తోంది. ముఖ్యంగా ఈ విషయాన్ని ఎమ్మెల్సీ కవిత ఇదివరకే ప్రస్తావించారు. తాను ఏదైనా నియోజకవర్గంలో నాయకులను కలిసేందుకు వెళ్తే.. స్థానిక నేతలు(ఎమ్మెల్యేలు) అడ్డంకులు సృష్టించే వారని, ఈ కారణంగానే కార్యకర్తలను కలవలేక పోయానని వ్యాఖ్యానించారు. అర్బన్ నేతలను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. మరోవైపు పార్టీ కార్యక్రమాలకు వెళ్లి ఇబ్బందులు పడేకంటే దూరంగా ఉండడం ఉత్తమమని కొందరు సీనియర్లు ఇళ్లకు పరిమితమయ్యారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి చక్రం తిప్పిన నేతలు తీరా.. పదవి కొల్పోయాక సొంత పార్టీలో రాజకీయాలు చేయడం ఏమిటని గులాబీ నాయకులు గుసగుసలాడుతున్నారు. అలాగే ఈ విషయమై పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది.