అక్షరటుడే, ఆర్మూర్: పట్టణ మున్సిపాలిటీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైస్ ఛైర్మన్ మున్నూకు ఇంఛార్జి ఛైర్మన్ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. మున్సిపాలిటీకి సంబంధించి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇంఛార్జి ఛైర్మన్ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి చెందిన 16 మంది కౌన్సిలర్స్ కాంగ్రెస్ లో చేరారు. ఈ నేపథ్యంలో వైస్ ఛైర్మన్ మున్నూకు ఇంఛార్జి బాధ్యతలు అప్పగించడం చర్చకు దారితీసింది. ఇదివరకు ఛైర్ పర్సన్ గా కొనసాగిన పండిత్ వినీతపై సొంత పార్టీ వారే గతంలో అవిశ్వాసం ప్రవేశపెట్టారు. ప్రత్యేక సమావేశం అనంతరం అవిశ్వాసం నెగ్గినట్లు అధికారులు ప్రకటించారు. తిరిగి కొద్ది రోజులకు అవిశ్వాసం వీగినట్లు ప్రభుత్వం పేర్కొంది. తీరా బీఆర్ఎస్ కార్పొరేటర్లు హైకోర్టును ఆశ్రయించగా.. అవిశ్వాసం నెగ్గినట్లు ప్రభుత్వ వర్గాలు కోర్టుకు తెలిపాయి. ఇలా ఈ అవిశ్వాస ప్రక్రియ అనేక మలుపులు తిరిగింది. చివరకు వైస్ ఛైర్మన్ మున్నూ తో పాటు 15 మంది కౌన్సిలర్స్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడంతో పరిణామాలన్ని మారిపోయాయి. మున్సిపాలిటీలో గతంలో కాంగ్రెస్ పార్టీకి కేవలం ఒక సీటు మాత్రమే ఉండగా ప్రస్తుతం బలాన్ని 17కు పెంచుకుంది.