అక్షరటుడే, ఇందూరు: మూడేళ్లుగా పెండింగ్ లో ఉన్న డిగ్రీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రైవేటు కళాశాలల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత సంవత్సరం కొన్ని నిధులు విడుదల చేసినా.. ఇప్పటి వరకు తమకు అందలేదని పేర్కొన్నారు. కళాశాలల నిర్వహణ కష్టంగా మారిందని, ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేసే వరకు విద్యార్థుల నుంచి ఫీజులు తీసుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం అందించిన వారిలో సంఘ సభ్యులు సంజీవరెడ్డి, నిషిత రాజు, సుధాకర్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ రాజు తదితరులు పాల్గొన్నారు.